ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా వైరస్... జ్వరం, ఫ్లూ లాంటిదే: సీఎం జగన్ - corona latest news

కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం పడిందని ముఖ్యమంత్రి జగన్ వివరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని వెంటనే గుర్తిస్తున్నామని వివరించారు. చికిత్స అందించడంలో సమగ్ర విధానం అమలు చేస్తున్నామన్న సీఎం... కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడం బాధ కలిగించే అంశమని పేర్కొన్నారు.

CM Jagan Press Meet Over Corona
సీఎం జగన్

By

Published : Apr 1, 2020, 5:33 PM IST

Updated : Apr 2, 2020, 5:18 AM IST

ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి

దిల్లీ వెళ్లిన వచ్చిన ప్రతి ఒక్కరినీ, వారిని కలిసిన వారిని గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి చెప్పారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని వెంటనే గుర్తిస్తున్నామని వివరించారు. చికిత్స అందించడంలో సమగ్ర విధానం అమలు చేస్తున్నామన్న సీఎం... కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడం బాధ కలిగించే అంశమని పేర్కొన్నారు. దిల్లీ వెళ్లివచ్చిన వారివల్ల అనేకమందికి కరోనా వైరస్ సోకిందని వివరించారు. కరోనా వైరస్‌తో భయాందోళన వద్దని... ఇది కూడా జ్వరం, ఫ్లూ లాంటిదేనని చెప్పారు. వయసు పైబడిన వాళ్లపై వైరస్‌ ప్రభావం కాస్త ఎక్కువ ఉంటుందన్నారు.

దిల్లీ వెళ్లివచ్చిన వాళ్లే 70 మంది...
దేశాల ప్రధానులు, వారి కుటుంబసభ్యులకు సైతం కరోనా వచ్చిందని ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి పేర్కొన్నారు. చికిత్స తీసుకున్న తర్వాత చాలామందికి నయమైందని గుర్తు చేశారు. బాధితుల్లో దిల్లీ వెళ్లివచ్చిన వాళ్లే 70 మంది ఉన్నారని చెప్పారు. 1,080 మంది దిల్లీ వెళ్లారన్న సీఎం... వారిలో 585 మందికి పరీక్షలు చేయగా 70 కేసులు పాజిటివ్ కేసులు వచ్చాయని వెల్లడించారు. విదేశాలకు వెళ్లివచ్చిన వాళ్లు స్వచ్ఛందంగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. 104కు ఫోన్ చేసి వైద్యపరీక్షలు చేసుకోవాలని కోరారు. 14 రోజుల తర్వాత వారిని ఇంటికి పంపిస్తామన్నారు.

ఎలాంటి సమస్యలున్నా ఆరోగ్య సిబ్బందికి చెప్పండి...
ఆరోగ్య సిబ్బంది ఇప్పటికే రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ వెళ్లి పరిస్థితి సమీక్షిస్తున్నారని సీఎం జగన్ ఉద్ఘాటించారు. ఎవరికి ఎలాంటి సమస్యలున్నా ఆరోగ్య సిబ్బందికి చెప్పాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా 81 శాతం కేసులు ఇళ్లలోనే ఉండి నయమైన పరిస్థితి ఉందన్నారు. కేవలం 14 శాతం మందినే ఆస్పత్రికి తరలించాల్సిన పరిస్థితి ఉందని వివరించారు. 5 శాతం మందికే ఐసీయూలో చికిత్స అవసరం ఉంటుందని సీఎం జగన్ చెప్పారు.

మొహమాటం, అనుమానం వద్దు...
సమస్యలు ఉన్నవారికి ఆరోగ్య సిబ్బంది మందులు ఇస్తారని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఆరోగ్య పరిస్థితిపై నిత్యం ఆరా తీస్తారని వివరించారు. ఆరోగ్య పరిస్థితి చెప్పేందుకు ఏ మాత్రం మొహమాటం, అనుమానం వద్దని సూచించారు. సంక్షోభ సమయంలో సేవలు అందించాలని ప్రైవేటు సంస్థలను కోరారు. ఇలాంటి సమయంలో వైద్యులు, నర్సులు, వైద్యకళాశాలలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఆర్థిక పరిస్థితిపై భారం పడింది...
కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం పడిందని సీఎం జగన్ వివరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రైతులు వ్యవసాయ పనులు చేసుకోవాలని చెప్పారు. పనులు చేసేటప్పుడు రైతులు, కూలీలు భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఇతర వ్యాధుల్లాగే కరోనానూ పూర్తిగా నయం చేయవచ్చని సీఎం జగన్ పేర్కొన్నారు. కాస్త జాగ్రత్తలు తీసుకుంటే చాలు.. ఈ మహమ్మారిని అరికట్టవచ్చన్నారు. కరోనా సోకిన రోగులపై ఆప్యాయత, అభిమానం చూపించాలని సూచించారు.

ఇదీ చదవండీ... కరోనా పాజిటివ్ కేసులు: ఏయే జిల్లాలో ఎంతమంది..?

Last Updated : Apr 2, 2020, 5:18 AM IST

ABOUT THE AUTHOR

...view details