ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లాక్‌డౌన్‌ విరమణ ప్రణాళికను సిద్ధం చేయండి: సీఎం జగన్​

లాక్ డౌన్ విరమణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు, ప్రజారవాణా, సినిమా హాళ్లు, రెస్టారెంట్ల ప్రారంభానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. లాక్‌డౌన్‌ విరమణ ప్రణాళికను సిద్ధం చేయమని అధికారులకు... సీఎం జగన్‌ ఆదేశించారు.

CM Jagan ordered the authorities to prepare a lockdown retirement plan
CM Jagan ordered the authorities to prepare a lockdown retirement plan

By

Published : May 15, 2020, 11:41 AM IST

Updated : May 15, 2020, 12:00 PM IST

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విరమణ ప్రణాళిక(ఎగ్జిట్‌ ప్లాన్‌)లో భాగంగా విద్యాసంస్థలు, ప్రజా రవాణా, సినిమా హాళ్లు, రెస్టారెంట్‌ల కార్యకలాపాల్ని తగిన జాగ్రత్తలతో ప్రారంభించేందుకు అవసరమైన ప్రామాణిక నిర్వహణ విధానం(ఎస్‌ఓపీ) సిద్ధం చేయాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. వాటిపై తగిన ప్రణాళికలు రూపొందించి తనకు అందజేయాలని సూచించారు. సొంత రాష్ట్రాలకు కాలినడకన తరలి వెళ్తున్న వలస కార్మికుల దుస్థితిపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. వారిని స్వస్థలాలకు పంపేందుకు అవసరమైన ఆలోచన చేయాలని, వారికి రహదారి వెంట భోజనం, తాగునీరు అందేలా చూడాలని ఆదేశించారు. కొవిడ్‌ నివారణ చర్యలపై గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. కంటెయిన్‌మెంట్‌ సముదాయాలలో అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులు ప్రతిపాదనలు అందజేశారు.

మహారాష్ట్ర నుంచి వచ్చినవారిలో ఎక్కువ పాజిటివ్‌ కేసులు
రాష్ట్రానికి మహారాష్ట్ర నుంచి వచ్చినవారిలో కరోనా పాజిటివ్‌ కేసులు అధికంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ముంబయి నుంచి అనంతపురం వచ్చిన వారిలో ఎక్కువ కేసులు బయటపడుతున్నట్టు ముఖ్యమంత్రికి వివరించారు.

జులై 1 నాటికి పీహెచ్‌సీల్లో మోటార్‌ సైకిళ్లు
టెలీమెడిసిన్‌ను పటిష్ఠంగా అమలు చేసేందుకు జులై1 నాటికి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాని(పీహెచ్‌సీ)కి ఒక మోటార్‌ సైకిల్‌ను సమకూర్చాలని సీఎం ఆదేశించారు. అదే రోజు 108, 104 సర్వీసుల కోసం 1,060 అంబులెన్స్‌లు ప్రారంభించనున్నట్టు తెలిపారు.

నెలాఖరుకు ‘సీఎం యాప్‌’
మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కోసం రూపొందిస్తున్న ‘సీఎం యాప్‌’ ఈ నెల 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించే నాటికి సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

* రాష్ట్రంలోని మొత్తం 11,159 గ్రామ సచివాలయాలకుగాను 151 (1.5%) కంటెయిన్‌మెంట్‌ సముదాయాలలో ఉన్నాయి.
* 3,858 వార్డు సచివాలయాలకుగాను 551 (14.31%) కంటెయిన్‌మెంట్‌ సముదాయాలలో ఉన్నాయి.
* రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కంటెయిన్‌మెంట్‌ సముదాయాలలో... 75 చోట్ల గడచిన 28 రోజులుగా కొత్త కేసులేవీ నమోదవనందున, వాటిని డీనోటిఫై చేసి సాధారణ కార్యకలాపాలకు అనుమతిస్తారు.

ఇదీ చదవండి:మార్పు మంచిదే: కుటుంబ వ్యవస్థకు కరోనా సవాళ్లు

Last Updated : May 15, 2020, 12:00 PM IST

ABOUT THE AUTHOR

...view details