ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో హత్యకు గురైన కుటుంబాలతో పాటు అత్యాచారానికి గురైన కుటుంబాలకు కూడా ఉద్యోగాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. క్రమం తప్పకుండా ఈ చట్టం అమలు, పనితీరుపై సమీక్ష చేయాలని అధికారులను, రాష్ట్రస్థాయి పర్యవేక్షణా కమిటీని ఆదేశించారు. సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కీలకమైన అంశాలను సీఎం ప్రస్తావించారు. 2013 నుంచి ఇప్పటి వరకూ ఈ హైపవర్ కమిటీ సమావేశాలు జరక్కపోవటం శోచనీయమని వ్యాఖ్యానించారు. ప్రతీ మూడు నెలలకూ జిల్లాస్థాయి కమీటీలు సమావేశం కావాలని ఆదేశించారు. తదుపరి సమావేశాల్లో మునుపటి నిర్ణయాల అమలును పరిశీలంచాలని స్పష్టం చేశారు. ఈ చట్టం కింద కేసులు నమోదు అయితే సొంత అధికారులపై కూడా పోలీసు శాఖ చర్యలు తీసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. చట్టం అమలు తీరుపై చిత్తశుద్ధికి ఇది నిదర్శనమవుతుందని వెల్లడించారు.
చట్టానికి ఎవరూ అతీతులు కారు..
ఎస్సీ, ఎస్టీ చట్టానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పోలీసు శాఖ కఠిన నిర్ణయాలు తీసుకుందని సీఎం అన్నారు. తప్పు చేసినవారు తమవారైనా సరే.. సంబంధిత పోలీసు అధికారులపై ఆ శాఖ చర్య తీసుకుందన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని నిరూపించారని. ఎస్సై, సీఐలపై చర్యలు తీసుకోవటం వల్ల ప్రజలకు దగ్గరయ్యారని సీఎం పేర్కొన్నారు. వేధింపులకు గురైన కేసుల్లో బాధితులకు ఆర్థిక సహాయాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో అత్యాచారం, హత్యకు గురైన కుటుంబాలకూ ఉద్యోగాలు కల్పించాలని ఎలాంటి జాప్యానికి తావులేదని సీఎం స్పష్టం చేశారు. బాధితులకు అందుబాటులో భూమి ఉంటే ఇవ్వాలని లేని పక్షంలో సేకరించి పంపిణీ చేయాలని సీఎం ప్రతిపాదించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పర్యవేక్షణకు రాష్ట్రంలో ఓ నిర్ధుష్ట ప్రణాళిక ఉండాలని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదైన కేసుల్లో దర్యాప్తు ప్రగతిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలని సీఐడీ విభాగాన్ని ఆదేశించారు. అణగారిన వర్గాలకు పోలీసులు దగ్గర కావాలన్నారు.