ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Land Resurvey in AP: భూ యజమానికి తెలియకుండా రికార్డులు మార్చే ప్రసక్తే ఉండదు: సీఎం జగన్

ap cm jagan
ap cm jagan

By

Published : Jan 18, 2022, 11:35 AM IST

Updated : Jan 18, 2022, 1:54 PM IST

11:32 January 18

వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం ప్రారంభం

Land resurvey in ap:భూ యజమానికి తెలియకుండా రికార్డులు మార్చే ప్రసక్తే ఉండదని సీఎం జగన్ స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం సేవలను తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. సివిల్‌ వివాదాలకు స్వస్తి పలకాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భూముల రికార్డులు ట్యాంపరింగ్‌ జరుగుతోందని వింటున్నామని.. ఇంటి స్థలం, పొలాలు రికార్డులు, రిజిస్ట్రేషన్‌లో వేరే మాదిరిగా ఉంటున్నాయని చెప్పారు. రికార్డుల్లో ఒక మాదిరిగా.... భూముల వద్దకు వెళ్తే కొలతల్లో తేడా ఉంటుందని గుర్తు చేశారు. ఇలాంటి వాటికి స్వస్తి చెప్పేందుకు ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు.

"భూముల రికార్డులు ట్యాంపరింగ్‌ జరుగుతోందని వింటున్నాం. ఇంటి స్థలం, పొలాలు రికార్డులు, రిజిస్ట్రేషన్‌లో వేరే మాదిరిగా ఉంటున్నాయి. రికార్డుల్లో ఒకమాదిరిగా.. భూముల వద్దకు వెళ్తే కొలతల్లో తేడా ఉంటుంది. సివిల్‌ వివాదాలకు స్వస్తి పలకాలన్నదే మా లక్ష్యం. భూములకు సంబంధించిన నిర్ధిష్ఠ హద్దును ఇవ్వగలగాలి. ఆక్రమణలు, కబ్జాలు, నకిలీ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేస్తున్నాం" - ముఖ్యమంత్రి జగన్

నకిలీ రిజిస్ట్రేన్లకు అడ్డుకట్ట...
cm jagan on Land Resurvey: ఆక్రమణలు, కబ్జాలు, నకిలీ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోని ప్రతి భూమిని 2023 నాటికి సమగ్ర ఆధునిక పద్ధతుల్లో రీ-సర్వే చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకోసమే 2020లో రీ-సర్వేకు శ్రీకారం చుట్టామన్న ముఖ్యమంత్రి.. దాదాపు రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సర్వేలో 4,500 సర్వే బృందాలు పనిచేస్తున్నాయని.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనులు జరుగుతున్నాయని వివరించారు.

"భూ యజమానికి తెలియకుండా రికార్డులు మార్చే ప్రసక్తే ఉండదు. సర్వే చేసేటప్పుడు భూ యజమానిని భాగస్వామ్యం చేస్తున్నాం. అభ్యంతరాలు ఉంటే మండల స్థాయిలోనే పరిష్కరించుకోవచ్చు. యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు అందజేయడం జరుగుతోంది. కచ్చితంగా సబ్‌డివిజన్‌ చేశాకే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సాగుతుంది. భూ సమాచారం ఎక్కణ్నుంచైనా పొందేందుకు వీలు కలుగుతుంది"- ముఖ్యమంత్రి జగన్

రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలోనూ..
గ్రామ సర్వేయర్లతో ఫీల్డ్ లైన్ దరఖాస్తులు 15 రోజులు, పట్టా సబ్ డివిజన్ ఫిర్యాదులను 30 రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. సింగిల్ విండో విధానంలోనూ ప్రతి ఆస్తికి ప్రభుత్వ హామీతో శాశ్వత భూ హక్కు కల్పిస్తున్నామన్నారు. రీ-సర్వే పూర్తయితే ఎక్కడి నుంచి అయినా భూముల వివరాలు పొందే అవకాశం వస్తుందన్నారు. 37 గ్రామ సచివాలయాల్లో భూములు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందని, రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలోనూ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు.

రీసర్వే వివరాలు ఇలా..
YSR Jagananna Saswatha Bhu Hakku Mariyu Bhu Raksha Pathakam: వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు , భూరక్ష పథకం కింద ప్రభుత్వం భూముల రీ-సర్వే చేపట్టింది. వందేళ్ల తర్వాత దేశంలోనే తొలిసారిగా చేపట్టిన ఈ సర్వేలో.. మొదటి దశలో భాగంగా 51 గ్రామాల్లోని 12 వేల 776 మంది భూ యజమానుల భూములను రీ-సర్వే చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు 21 వేల 404 భూ కమతాలకు సంబందించిన 29 వేల 563 ఎకరాల భూములను రీ-సర్వే చేసి.. 3వేల304 అభ్యంతరాలను పరిష్కరించినట్లు వివరించింది. రీ-సర్వే చేసిన భూమి రికార్డులను సీఎం జగన్ ఇవాళ రాష్ట్ర ప్రజలకు అంకితం చేశారు. రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో అవసరమైన ప్రక్రియను పూర్తి చేసి ఆయా గ్రామ సచివాలయాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. జూన్‌ 2023 నాటికి దశలవారీగా రాష్ట్రంలోని భూముల రీ-సర్వే పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

ఇదీ చదవండి:

LAND REGISTRATIONS:37 గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు

Last Updated : Jan 18, 2022, 1:54 PM IST

ABOUT THE AUTHOR

...view details