కృష్ణా జలాల విషయంలో తెలంగాణతో కొనసాగుతున్న వివాదంపై.. ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా స్పందించారు. సీమ, కోస్తా, తెలంగాణకు కృష్ణా జలాల్లో వాటా గతంలోనే ఉందని అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో.. ఈ విషయమై మాట్లాడారు. జలాల పంపిణీ విషయంలో తెలంగాణ నేతలు ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. నీటి కేటాయింపుపై గతంలోనే ఒప్పందాలు జరిగాయని గుర్తు చేశారు. ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయించారని గుర్తు చేశారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 885 అడుగులని.. 881 అడుగులు చేరితే తప్ప నీళ్లు కిందకు రాని పరిస్థితి ఉందని వివరించారు. సీమ ఎత్తిపోతలకు 881 అడుగుల్లో లిఫ్టు పెట్టి వాడుకుంటే తప్పేముందని జగన్ ప్రశ్నించారు.
తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి సామర్థ్యం పెంచి చేపడుతోందని ఆరోపించారు. 796 అడుగుల్లోనే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని విమర్శించారు. రాష్ట్రాల మధ్య సఖ్యత ఉంటేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు వెల్లడించారు. పాలకుల మధ్య సఖ్యత ఉండాలన్నారు. బైరవాని తిప్ప ప్రాజెక్టుకు యుద్ధప్రాతిపదికన భూసేకరణ చేపడుతామని జగన్ స్పష్టం చేశారు. ప్రాజెక్టు కోసం 1,400 ఎకరాల భూసేకరణ జరగాలన్నారు. కర్ణాటక, తమిళనాడు రాజకీయాల్లో జోక్యం చేసుకోబోనని జగన్ స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ ఇతర రాష్ట్రాల రాజకీయాల్లో జోక్యం చేసుకోనన్నారు.