ఆరోగ్య శ్రీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్తరించింది. వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పథకం వర్తించేలా సేవలు విస్తరించింది. ఈ ఏడాది జనవరి 3 నుంచి పైలట్ ప్రాజెక్టు కింద పశ్చిమగోదావరి జిల్లాలో కొత్త విధానం అమలు చేశారు. ఇప్పుడు మరో 6 జిల్లాలకు ఈ సేవలు విస్తరించారు. విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు జిల్లాల్లో ప్రజలకు ఈ విధానం అందుబాటులోకి రానుంది. ఈ ఏడు జిల్లాల్లో వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్య శ్రీ పథకం వర్తిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ నూతన సేవల విస్తరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్‌లో మాట్లాడారు.
ఆరోగ్య రంగంలో పూర్తిగా మార్పులు చేస్తున్నామని... 27 భోదనాసుపత్రులు తయారు చేయబోతున్నామని సీఎం పునరుద్ఘాటించారు. జాతీయ ప్రమాణాల దిశగా ఆస్పత్రులను తయారుచేస్తున్నామని తెలిపారు. ప్రతి నెట్‌వర్క్ ఆస్పత్రినీ గ్రేడింగ్ చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు తీసుకోవాలంటే భయం వేసే పరిస్థితి ఉండేదని... ఇప్పుడు బయట దొరకని మందులు అక్కడే ఇస్తున్నామన్నారు. ప్రతి గ్రామానికి వైఎస్‌ఆర్ విలేజ్ క్లినిక్‌లు తీసుకొస్తున్నట్టు జగన్ పేర్కొన్నారు. కంటి వెలుగు కార్యక్రమంతో లక్షా 29 వేల మంది పిల్లలకు కళ్లజోళ్లు ఇచ్చామని గుర్తు చేశారు. పాఠశాలలు తెరవగానే మిగిలిన పిల్లలకు కూడా కంటి చికిత్సలు ఆందిస్తామన్నారు.