వైఎస్‌ఆర్ జగనన్న ఇళ్లు కాదు.. కాలనీలు రాబోతున్నాయని సీఎం జగన్ అన్నారు. ఇళ్లు కాదు వేల ఊళ్లు కడుతున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి 15 రోజులపాటు ఇళ్ల పండగ జరగబోతోందని హర్షం వ్యక్తం చేశారు. క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి ఈరోజే కావడం ఒక ప్రత్యేకత అని సీఎం పేర్కొన్నారు. ఇలాంటి ప్రత్యేక రోజు 30 లక్షల 75 వేల ఇళ్ల స్థల పట్టాలు పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం కొమరగిరిలో 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. రెండు దశల్లో రూ.50,940 కోట్లు వెచ్చించబోతున్నామని సీఎం జగన్ తెలిపారు. మొదటి దశ కింద 15 లక్షల 60 వేల ఇళ్లను నిర్మించేందుకు శ్రీకారం చుట్టామన్నారు. 2 లక్షల 62 వేల టిడ్కో ఇళ్లకు కూడా ఇవాళే అందించబోతున్నామని సీఎం జగన్ అన్నారు.
కోటి 24 లక్షల మందికి మేలు
కులం, మతం, ప్రాంతం, వర్గం ఏదీ చూడకుండా అర్హులైన అందరికీ ఇళ్లు కేటాయిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. అర్హత మాత్రమే ప్రాతిపదిక చేసుకుని ఇళ్లు కేటాయిస్తున్నామన్నారు. కోటి 24 లక్షల మందికి మేలు జరిగేలా చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.
జగనన్న కాలనీలు రాబోతున్నాయ్..
'రాబోయే రోజుల్లో 17,005 వైఎస్‌ఆర్ జగనన్న కాలనీలు రాబోతున్నాయి. కాలనీల్లో పార్కులు, కమ్యూనిటీ హాళ్లతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. డ్రెయినేజీలు, రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. 224 చదరపు అడుగుల నుంచి 340 చదరపు అడుగులకు పెంచాం. 68,361 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల రూపంలో నిరుపేదలకు అందిస్తున్నాం. స్థలమే కాదు... ఇంటి నిర్మాణ బాధ్యత కూడా తీసుకుంటున్నాం. పేదల సొంతింటి కల నెరవేర్చడం అనేది ప్రభుత్వాల కనీస బాధ్యత '- సీఎం జగన్
నిరంతర ప్రక్రియ..
అత్యంత పారదర్శకంగా ఇంటిస్థలాలు ఇస్తున్నామని సీఎం జగన్ అన్నారు. ఇంటి స్థలాలపై ఎవరికైనా సందేహం ఉంటే వాలంటీర్లు సాయం చేస్తారని పేర్కొన్నారు. ఇంటిస్థలాల మంజూరు నిరంతర ప్రక్రియగా జరిగుతోందని... ఇంటిస్థలాలకు దరఖాస్తు చేయవచ్చని తెలిపారు. 90 రోజుల్లో పరిశీలించి ఇంటిస్థలాలు ఇస్తామని సీఎం జగన్ అన్నారు.