'కరోనా మూడో దశ సమాచారం నేపథ్యంలో రాష్ట్రంలో పిల్లల చికిత్సకు అవసరమైన వసతులు మెరుగుపరచాలి. రోజంతా (24 గంటలూ) పీడియాట్రిక్ సేవలు అందుబాటులో ఉండాలి. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని' సీఎం జగన్(CM JAGAN) ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, మూడో దశకు సంబంధించిన జాగ్రత్తలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన సమీక్షించారు. కొత్తగా తీసుకునే వైద్యులకు కూడా వెబినార్లో చర్చించిన అంశాలపై అవగాహన కల్పించాలని సీఎం సూచించారు.
కర్ఫ్యూ సడలింపులపై వివరణ..
ఈ సందర్భంగా రాష్ట్రంలో కర్ఫ్యూ వేళలను 8 జిల్లాల్లో సడలించాలని, 4 జిల్లాల్లో యథాతథంగా కొనసాగించాలని, ఒక జిల్లాలో పొడిగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ప్రస్తుతం సాయంత్రం ఆరు గంటల వరకే ఉన్న కర్ఫ్యూ వేళలను రాత్రి 9 గంటల వరకూ సడలించారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయి. పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా ఎక్కువగా ఉన్న పశ్చిమగోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నట్లుగానే సాయంత్రం 6 గంటల వరకే సడలింపు ఉంటుంది. ఆయా జిల్లాల్లో ఎటువంటి మార్పు లేదు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం మధ్యాహ్నం 2 గంటల వరకూ ఉన్న సమయాన్ని సాయంత్రం ఆరు గంటల వరకూ పొడిగించారు. జులై 1 నుంచి 7వ తేదీ వరకు ఈ నిర్ణయాలు అమలులో ఉంటాయని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు.
అధికారులు ఏం చెప్పారంటే..
* ప్రస్తుతం 44,773 క్రియాశీల కరోనా కేసులున్నాయి. ఇందులో 7,998 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రికవరీ రేటు 96.95 శాతంగా, పాజిటివిటీ రేటు 4.46శాతంగా ఉంది.
* 3,329 బ్లాక్ ఫంగస్ కేసులున్నాయి. 1,441 మంది చికిత్స పొందుతున్నారు. 253 మంది చనిపోయారు.
* మూడోదశ దృష్ట్యా ఇప్పటికే మూడు దఫాలుగా నిపుణులతో వెబినార్ నిర్వహించాం.