CM JAGAN : అమరావతి రాజధాని పూర్తి చేయాలంటే వందేళ్లు పడుతుందని.. సీఎం జగన్ అన్నారు. అందుకు 20 నుంచి 30 లక్షల కోట్లు పడుతుందన్నారు. పరిపాలన వికేంద్రీకరణపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఈ మేరకు సీఎం వెల్లడించినట్లు పీటీఐ కథనం తెలిపింది. ప్రస్తుత ధరల ప్రకారం కనీస మౌలిక వసతుల కల్పనైన రోడ్లు, డ్రెయిన్స్, విద్యుత్ అవసరాలకే.. లక్షా ఐదు వేల కోట్లు ఖర్చుచేయాల్సి వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో వికేంద్రీకరణ లక్ష్యంగా 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పినట్లు పీటీఐ తెలిపింది.
ఇప్పటికీ రాష్ట్రంలోని 80 శాతం మంది దారిద్రరేఖకు దిగువనే నివసిస్తున్నారన్న సీఎం.. ప్రస్తుత పరిస్థితుల్లో సంవత్సరానికి వెయ్యి లేదా రెండు వేల కోట్లు కూడా రాజధానికి కేటాయించలేమని చెప్పారు. ఇలాంటి తరుణంలో రాజధాని పూర్తవడానికి వందేళ్ల సమయం పడుతుందన్నారు. అంటే అమరావతిని పూర్తిచేయడమంటే కలల వెనక పరిగెత్తడమేనన్నారు. అదే సమయంలో పరిపాలన రాజధానిగా తమ ప్రభుత్వం ప్రకటించిన విశాలో కేవలం పదివేల కోట్లు ఖర్చుచేస్తే.. అవసరమైన మౌలికవసతులు కల్పించగలమని సీఎం అసెంబ్లీలో చెప్పినట్లు పీటీఐ వెల్లడించింది.
అమరావతి సెల్ఫ్ పైనాన్సింగ్ ప్రాజెక్టన్న వ్యాఖ్యలపై స్పందించిన సీఎం.. అక్కడ కేవలం 4వేల 997 ఎకరాలు మాత్రమే విక్రయించడానికి అందుబాటులో ఉంటుందన్నారు. ఎకరాను 20 కోట్ల ధరకు అమ్మితే కేవలం లక్ష కోట్లు మాత్రమే సమకూరుతాయన్నారు. ఆ డబ్బు కనీస మౌలిక వసతుల కల్పనకే సరిపోతుందని చెప్పారని.. పీటీఐ పేర్కొంది. అదే సమయంలో అమరావతి పేరుతో భ్రమలు కల్పించి ప్రజలను మోసం చేసిన వారిపై 420 సెక్షన్ల కింద కేసులు పెట్టాలని అన్నట్లు తెలిపింది.