ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం' - వైకాపా ఏడాది పాలన వార్తలు

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ అన్నారు. రైతుల కోసం అనేక పథకాలను తీసుకొచ్చామని చెప్పారు. వారిని ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రైతులకు ఉచితంగా బోర్లు వేయించే కార్యక్రమానికి ఖరీఫ్ నుంచి శ్రీకారం చుడతామన్నారు.

cm jagan
cm jagan

By

Published : May 26, 2020, 2:13 PM IST

Updated : May 26, 2020, 2:43 PM IST

ముఖ్యమంత్రి జగన్

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే వైకాపా ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. 'మన పాలన - మీ సూచన' పేరిట రెండో రోజు జరిగిన మేథోమధన సదస్సులో ఆయన పాల్గొన్నారు. రైతు ఖర్చులు తగ్గించేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. వరదలు, కరవు వచ్చినప్పుడు రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

రాష్ట్రంలో 1.25 ఎకరాలలోపు 50 శాతం మంది.. హెక్టారు వరకు భూమి ఉన్న వారు 50-70 శాతం మంది రైతులు ఉన్నట్లు సీఎం తెలిపారు. 80 శాతం పంటలకు రైతు భరోసా సొమ్ము రూ.13500 అందిస్తున్నామని అన్నారు. రూ.12,500 ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టామని.. అధికారంలోకి వచ్చాక రూ.13,500 ఇస్తున్నామని పేర్కొన్నారు. ఏడాదికి రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 ఒక్కో రైతుకు అందజేస్తున్నామని వివరించారు.

రైతులను ఆదుకునేందుకు రైతు భరోసా అమలు చేస్తున్నాం. ఏడాదిలోనే రైతు భరోసా కింద రూ.10,209 కోట్లు రైతులకు ఇచ్చాం. గత ప్రభుత్వం ఐదేళ్లలో రుణ మాఫీ కింద రూ.15 వేల కోట్లు కూడా చెల్లించలేదు. రైతులు నష్టపోకుండా ఉండేందుకు పంటల బీమా అమలు చేస్తున్నాం. ఈ ఏడాది రైతులకు ఉచితంగా పంటల బీమా అందిస్తున్నాం.- ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

ఏడాదిలో రూ.1270 కోట్లు బీమా సంస్థలకు ప్రభుత్వం పంటల బీమా కింద చెల్లించిందని సీఎం జగన్ అన్నారు. ప్రభుత్వమే బీమా సంస్థను నడిపి నష్టపోయిన రైతులకు వెంటనే సహాయం అందించేలా చర్యలు తీసుకుంటుందన్నారు. అధికారంలోకి రాగానే వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకాన్ని తీసుకొచ్చామని గుర్తు చేశారు. రైతులకు ఉచితంగా బోర్లు వేయించే కార్యక్రమానికి ఖరీఫ్ ప్రారంభంలో శ్రీకారం చూడతామని జగన్ స్పష్టం చేశారు.

సీఎం చెప్పిన మరిన్ని అంశాలు:

  • పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా అగ్రికల్చర్ అసిస్టెంట్ చర్యలు
  • సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసేలా పటిష్ట చర్యలు
  • ప్రాజెక్టుల్లో అవినీతిని పూర్తిగా తొలగించి ప్రాధాన్యత క్రమంలో పూర్తి
  • ఏడాదిలోనే రూ.1095 కోట్లు రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా

కరోనా ప్రభావం వల్ల పోలవరం పనులు నెమ్మదించాయని సీఎం జగన్ అన్నారు. 2021 సంవత్సరాంతానికి పోలవరం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాయలసీమ కరవు నివారణకు చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

యూనిసెఫ్​నే ఆలోచింపజేసిన విశాఖ బాలుడి ప్రశ్న

Last Updated : May 26, 2020, 2:43 PM IST

ABOUT THE AUTHOR

...view details