2022 ఖరీఫ్ నాటికి పోలవరం
‘నీటి ప్రయోజనాల విషయంలో రాజీ లేదని ఆచరణలో చూపిస్తున్నాం. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేలా అడుగులు వేస్తున్నాం. ఉత్తరాంధ్ర సుజలస్రవంతి, పల్నాడు కరవు నివారణ ప్రాజెక్టు, రాయలసీమ కరవు నివారణ ప్రాజెక్టుల పనులు మొదలుపెట్టబోతున్నాం. రైతులకు ఉచిత విద్యుత్ పథకం పదిలంగా ఉండేలా కొత్తగా 10 వేల మెగావాట్ల సౌరవిద్యుత్ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నాం. సమాజంలో 62 శాతం ఉన్న రైతులు, 52 శాతం ఉన్న మహిళల జీవితాల్లో మార్పు తేవాలన్న ఆకాంక్షతో రైతుభరోసా, అమ్మఒడి లాంటి పథకాలు అమలు చేస్తున్నాం. రైతుభరోసా ద్వారా రూ.11,200 కోట్ల సాయాన్ని అన్నదాతల ఖాతాల్లో వేశాం. 91 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూర్చేలా సున్నా వడ్డీ డబ్బులు జమ చేశాం. 2019 ఎన్నికల నాటి వరకూ ఉన్న డ్వాక్రా రుణాల మొత్తాన్ని నాలుగు విడతల్లో అందించే ఆసరా కార్యక్రమాన్ని వచ్చే నెలలో ప్రారంభిస్తాం. 23 లక్షల మంది మహిళలకు చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించాం. 30 లక్షల మంది అక్కాచెల్లెమ్మల పేరిట ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌కు రంగం సిద్ధమైంది’ అని సీఎం తెలిపారు.
మూడు ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా చట్టం: సీఎం జగన్
విశాఖపట్నం కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని, కర్నూలు కేంద్రంగా న్యాయ రాజధానికి త్వరలో పునాదులు వేస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర విభజన గాయాలు మానాలన్నా, అలాంటి దెబ్బ మరెన్నడూ తగలకుండా జాగ్రత్తపడాలన్నా, మూడు ప్రాంతాల్లో సమన్యాయం జరగాలన్నా.. వికేంద్రీకరణే సరైన విధానమని స్పష్టం చేశారు. అందుకే మూడు రాజధానుల బిల్లును చట్టంగా తీసుకొచ్చామని వెల్లడించారు. కేంద్రంలోని సుస్థిర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇప్పటికిప్పుడు ఇచ్చే పరిస్థితి లేకున్నా.. వారి మనసు మారుతుందన్న నమ్మకంతో హోదా కోసం ఎప్పటికీ డిమాండ్ చేస్తూనే ఉంటామని చెప్పారు. 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని శనివారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ప్రసంగిస్తూ.. అధికారం చేపట్టిన తొలి 14 నెలల్లోనే వివిధ పథకాల ద్వారా రూ.59 వేల కోట్లను నేరుగా ప్రజలకు అందించామన్నారు.
అంటరానితనం బాహాటంగా కనిపిస్తోంది
‘రాజ్యాంగం ప్రకారం అంటరానితనం నేరమైనా.. విద్యాపరమైన అంటరానితనం పాటించాల్సిందేననే వాదనలు వినిపిస్తున్నాయి. మా పిల్లలు, మనవళ్లను ఆంగ్ల మాధ్యమంలోనే చదివిస్తాం.. పేద పిల్లలు మాత్రం అది చదవడానికి వీల్లేదన్న వాదనతో రూపం మార్చుకున్న అంటరానితనం బాహాటంగానే కనిపిస్తోంది. దీన్ని ఎలా సమర్థించుకోగలం? తల్లిదండ్రుల కోరిక మేరకు ఆంగ్ల మాధ్యమాన్ని ఓ హక్కుగా అమలు చేస్తున్నాం. ప్రతి ఇంటా చదువుల దీపాలు వెలిగించేందుకు అమ్మఒడి అమలు చేస్తున్నాం. విద్యార్థులకు పుస్తకాల నుంచి బూట్ల వరకూ అన్నీ ఉచితంగా ఇస్తున్నాం. నాడు- నేడు ద్వారా బడులు, కళాశాలల రూపురేఖలు మారుస్తున్నాం. ఆరోగ్యశ్రీ పరిధిలోకి కొత్తగా వెయ్యి జబ్బులను తీసుకొచ్చాం’ అని వివరించారు.
గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్పాం
‘దేశంలోనే తొలిసారిగా గ్రామస్వరాజ్యానికి అర్థం చెప్పాం. గ్రామ సచివాలయ వ్యవస్థతో పాలన వికేంద్రీకరణలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించాం. అందులో 1.4 లక్షల మందికి ప్రభుత్య ఉద్యోగాలిచ్చాం. 2.7 లక్షల మంది వాలంటీర్లతో దేశంలోనే అత్యుత్తమ పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేశాం. ప్రభుత్వ సాయాన్ని వివక్ష లేకుండా తలుపుతట్టి ఇస్తున్నాం. రాజ్యాంగంలోని న్యాయం, సమానత్వం అనే పదాలకు నిజమైన అర్థం చెబుతూ మా 14 నెలల పాలన సాగిందని గర్వంగా ప్రకటిస్తున్నా’ అని వివరించారు.
కొవిడ్ సైనికులకు సెల్యూట్ చేద్దాం
‘స్వాత్రంత్య సమరయోధులను స్మరించుకున్నట్లే.. కొవిడ్ నుంచి మనల్ని కాపాడేందుకు సైనికుల్లా పనిచేస్తున్న వారికీ సెల్యూట్ చేద్దాం’ అని జగన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: టీమ్ఇండియా క్రికెట్లో ఓ శకం.. ధోనీ