వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ప్రజారోగ్యం దృష్ట్యా ఈ జాగ్రత్తలు తప్పవని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఖాళీలను గుర్తించి.. 90 రోజుల్లో నియామకాలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక.. ఎక్కడా వైద్యులు, సిబ్బంది లేరనే మాటలు వినిపించకూడదు. డిప్యుటేషన్ అనే పదాలూ రాకూడదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై క్యాంపు కార్యాలయంలో సీఎం గురువారం సమీక్షించారు.
‘బయోమెట్రిక్‌తో పక్కాగా హాజరు తీసుకోవాలి. పని తీరుపైనా పర్యవేక్షణ ఉండాలి. ప్రజలకు వైద్య సేవలందించడంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదు. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ ద్వారానే సమర్థంగా సేవలు అందించాలి. డబ్ల్యూహెచ్‌వో, జీఎంపీ ప్రమాణాలున్న మందులే ఇవ్వాలి. దీనికి అనుగుణంగా నిరంతర తనిఖీలను నిర్వహించాలి’ అని సూచించారు. ‘రాష్ట్రంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగించాలి. కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా పండగల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వినాయక విగ్రహాలను ఇళ్లలో పెట్టుకునేందుకే అనుమతులివ్వాలి. బహిరంగ స్థలాల్లో విగ్రహాలు వద్దు. నిమజ్జన ఊరేగింపులూ వద్దు’ అని వైద్యాధికారులు చేసిన సిఫారసుపై సీఎం సమీక్షించారు. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేయాలని ఆదేశించారు.