దిల్లీలో ప్రధాని మోదీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ కలిశారు. రాష్ట్ర సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అలాగే రైతుభరోసా ప్రారంభోత్సవానికి పీఎంను ఆహ్వానించారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా అదనపు కేంద్ర సాయం కోసం ప్రధానిని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. అలాగే హామీ ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని లేకుంటే పెట్టుబడిదారులు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వైపు చూస్తారని సీఎం వివరించారు. రాష్ట్ర విభజన వల్ల పరిశ్రమలు, సేవారంగం బాగా దెబ్బతిన్నాయని అన్నారు. తలసరి ఆదాయం రూ.1.46 లక్షల నుంచి రూ.1.29 లక్షలకు తగ్గిందని... రెవెన్యూ లోటు కింద రూ.18,969 కోట్లు రావాల్సి ఉందని ప్రధానికి
తెలిపారు. అలాగే వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలన్నారు.
'నవరత్నాలను దేశమంతటా అమలు చేయండి' - కడప ఉక్కు పరిశ్రమపై చర్చ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం జగన్ ఇవాళ భేటీ అయ్యారు. విభజన గాయాలు, పెండింగ్ నిధులపై ప్రధానంగా చర్చించారు. కడప స్టీల్ ప్లాంట్, రామాయపట్నం పోర్టును కేంద్రం నిర్మించాలని కోరారు. ప్రత్యేక హోదాను ఇవ్వాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు నవరత్నాలకు చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు.
పోలవరంపై ప్రస్తావన..
పోలవరంలో సవరించిన అంచనాలు ఆమోదించాలని ప్రధాని నరేంద్ర మోదీని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. పోలవరానికి రాష్ట్రం ఖర్చు చేసిన రూ.5,103 కోట్లు ఇవ్వాలని అడిగారు. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.838 కోట్లు ఆదా చేశామని మోదీకి తెలిపారు. కృష్ణా, గోదావరి అనుసంధానానికి సహకరించాలని మోదీని కోరారు. ఈ దిశగా సంబంధిత మంత్రులకు ఆదేశాలు జారీ చేయాలని వినతి సమర్పించారు. విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టులకు ఆర్థికసాయం చేయాలని కోరారు.
దేశమంతటా నవరత్నాలు
కడప స్టీల్‌ప్లాంట్, రామాయపట్నం పోర్టును కేంద్రం నిర్మించాల్సి ఉందన్న జగన్...రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఈ ప్రాజెక్టులు ఎంతో కీలకమైనవని ప్రధానికి వివరించారు. విశాఖ–చెన్నై కారిడార్, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌కు నిధులు కావాలని, ఈ ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యేలా ఆయా శాఖలను ఆదేశించాలని ముఖ్యమంత్రి కోరారు. వీటితో పాటు నవరత్నాలకు చేయూత ఇవ్వాలని ప్రధాని మోదీని జగన్ కోరారు. నవరత్నాలు రాష్ట్రంలో ఒక కొత్త శకానికి నాంది పలుకుతున్నాయన్న సీఎం, వీటిని జాతీయస్థాయిలో అమలు చేయదగిన పథకాలని పీఎంతో అన్నారు. ఏపీలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టేలా ఆయా శాఖలను ఆదేశించాలని ప్రధాని మోదీని సీఎం జగన్ కోరారు.