గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాజ్ భవన్లో అరగంటపాటు జరిగిన భేటీలో పలు అంశాలపై చర్చించారు. తాడేపల్లి నివాసం నుంచి సతీ సమేతంగా బయలుదేరిన సీఎం జగన్ 11 గంటలకు రాజ్ భవన్ చేరుకున్నారు. గవర్నర్ దంపతులకు జగన్ దంపతులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గవర్నర్‌తో సీఎం భేటీ కొనసాగింది.
రాష్ట్రంలోని తాజా రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో శాసన సభ సమావేశాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం దాదాపు నిర్ణయించింది. సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకురానున్న మరిన్ని కీలక బిల్లులపై గవర్నర్‌తో ముందస్తుగా సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం పైనా గవర్నర్‌తో సీఎం చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో కొవిడ్ కేసుల పరిస్థితి, నివారణకు తీసుకుంటోన్న చర్యలు, సంక్షేమ పథకాల అమలు సహా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.