విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఆందోళనలు ఊపందుకోవడంతో సీఎం జగన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్ ను ఆదుకునేందుకు ఉన్న కొన్ని ప్రతిపాదనలను సూచించారు. సెయిల్ కు ఉన్న గనుల్లో కొన్నిటిని స్టీల్ ప్లాంట్ కు కేటాయించాలని... సీఎం ప్రధానికి విజ్ఞప్తి చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ఏపీ ప్రభుత్వం కాపాడుకుంటుందన్న జగన్.... ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ చేసిన ప్రతిపాదనను పునరాలోచించాల్సిందిగా ప్రధానిని కోరారు.
స్టీల్ ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని లేఖలో కోరారు. ప్లాంటును బలోపేతం చేయడానికి మార్గాల్ని అన్వేషించాలని సూచించారు. విశాఖ ఉక్కు ద్వారా సుమారు 20వేలమంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారని సీఎం పేర్కొన్నారు. పరోక్షంగా వేల మంది జీవనోపాధి పొందుతున్నారని ముఖ్యమంత్రి ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. "విశాఖ ఉక్కు –ఆంధ్రుల హక్కు" నినాదంపై ప్రజల పోరాట ఫలితంగా స్టీల్ ప్లాంట్ వచ్చిందని స్పష్టం చేశారు. దశాబ్ద కాలం పాటు ప్రజలు పోరాటం చేశారని..32 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. రాష్ట్ర సంస్కృతిలో, ప్రగతిలో భాగమైన ప్లాంట్ ను ప్రభుత్వం కాపాడుకుంటుందని సీఎం లేఖలో స్పష్టం చేశారు.
గతేడాది 200 కోట్ల లాభాలొచ్చాయ్..
2002–2015 మధ్య విశాఖ ఉక్కు మంచి పనితీరు కనపరిచిందని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్లాంటు పరిధిలో 19 వేల 700 ఎకరాల విలువైన భూములున్నాయని...ఈ భూముల విలువే దాదాపు లక్ష కోట్లు ఉంటుందని తెలిపారు. ఉత్పత్తి ఖర్చు విపరీతంగా పెరిగినందున ప్లాంటుకు నష్టాలు వచ్చాయని వివరించారు. స్టీల్‌ప్లాంటుకు సొంతంగా గనులు లేవని..పెట్టుబడుల ఉపసంహరణకు బదులు అండగా నిలబడితే ప్లాంటును మళ్లీ ప్రగతిబాటలోకి తీసుకెళ్లవచ్చన్నారు. 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం 6.3 మిలియన్ టన్నులు మాత్రమే ఏడాదికి ఉత్పత్తి చేస్తోందన్నారు. 2020 డిసెంబర్‌లో 200 కోట్ల రూపాయల లాభాన్ని ప్లాంటు ఆర్జించిందన్నారు. మరో రెండేళ్లు ఇలా కొనసాగితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్నారు.
గనులు కేటాయించండి
బైలదిల్లా గనుల నుంచి మార్కెట్ ధరకు ముడి ఇనుము ఖనిజాన్ని వైజాగ్ స్టీల్ ప్లాంటు కొనుగోలు చేస్తోందని..దాదాపు టన్ను ముడి ఖనిజాన్ని 5 వేల 260 రూపాయల చొప్పున కొనుగోలు చేయడం వల్ల టన్నుకు అదనంగా 3 వేల 472 రూపాయల చొప్పున భారం పడుతోందన్నారు. సెయిల్‌కు 200 ఏళ్లకు సరిపడా నిల్వలు ఉన్నాయని..వాటిలో కొన్నింటిని వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు కేటాయించడం ద్వారా పోటీ పరిశ్రమలతో సమాన స్థాయికి తీసుకెళ్లొచ్చని పేర్కొన్నారు. బ్యాంకుల నుంచి తెచ్చుకున్న రుణాల మొత్తాన్ని వాటా రూపంలోకి మార్చితే ఊరట కలుగుతుందన్నారు. వడ్డీ రేట్లు తగ్గిస్తే ప్లాంటుపై భారం తగ్గుతుందని సూచించారు. అలా చేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ స్టాక్ ఎక్సేంజీలో లిస్ట్ అవుతుందన్న సీఎం...ప్రజల నుంచి నిధుల సేకరణకు అవకాశం కూడా ఏర్పడుతుందన్నారు.సమాజానికి, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు ఎంతో విలువైన, ముఖ్యమైన విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ ప్రక్రియ కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం జగన్ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఇదీచదవండి
'ఎన్నికల అధికారులపై చర్యలకు ఎస్ఈసీ అనుమతి తప్పనిసరి'