రాష్ట్రంలోని బోధనాసుపత్రులన్నింటిలోనూ అత్యాధునిక రోగనిర్ధారణ సౌకర్యాలను (డయాగ్నస్టిక్ సర్వీసులు) పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు. ఒంగోలు, శ్రీకాకుళం, నెల్లూరు, కడప బోధనాసుపత్రుల్లో సీటీ స్కాన్, ఒంగోలు, నెల్లూరు, శ్రీకాకుళం బోధనాసుపత్రుల్లో ఎమ్మారై సౌకర్యాలను సీఎం బుధవారం 'వర్చువల్' విధానంలో ప్రారంభించారు.
తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... 'రాష్ట్రంలోని 11 బోధనాసుపత్రులు (టీచింగ్ హాస్పిటల్స్)ల్లో కేవలం ఏడింట్లో మాత్రమే సీటీ స్కాన్, ఎమ్మారై సౌకర్యం ఉంది. పీపీపీ విధానంలో వీటిని నిర్వహిస్తున్నారు. వీటి నిర్వహణ సక్రమంగా లేదు. ఇకపై వీటిని ప్రభుత్వమే స్వయంగా నిర్వహిస్తుంది. ‘నాడు- నేడు’ కింద బోధనాసుపత్రులను జాతీయ స్థాయి ప్రమాణాల మేరకు అభివృద్ధి చేస్తున్నాం. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో కొత్తగా బోధనాసుపత్రితో పాటు నర్సింగ్ కళాశాల కూడా రాబోతుంది. వీటిల్లోనూ సీటీ స్కాన్, ఎమ్మారై, ఇతర డయాగ్నస్టిక్ సర్వీసులను ప్రారంభిస్తాం. ఈ సదుపాయాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి, పేదలకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తాం. వీటి నిర్వహణ ఖర్చును ఆరోగ్యశ్రీ ట్రస్టు పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం కొత్తగా ప్రారంభించిన సీటీ స్కాన్, ఎమ్మారై సౌకర్యం ఏర్పాటుకు రూ.67 కోట్ల వరకు వ్యయమైంది. వీటికి మూడు సంవత్సరాల వారంటీ, తర్వాత మరో ఏడేళ్లపాటు సర్వీస్‌ను సంబంధిత కంపెనీలే చూస్తాయి' అని వివరించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, విద్యా శాఖ మంత్రి సురేష్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆరోగ్య సిబ్బంది సేవలను ఎంత పొగిడినా తక్కువే