ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'చంద్రబాబును జైలుకు పంపేందుకు జగన్ యత్నం'

చంద్రబాబును, తనను జైలుకు పంపేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యత్నిస్తున్నారని తెదేపా నేత దేవినేని ఉమ ఆరోపించారు. అందులో భాగంగానే వారంలోనే తనపై 5 కేసులు పెట్టారని వెల్లడించారు. కేసులతో అమరావతి ఉద్యమాన్ని అణిచేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని విమర్శించారు. అయినప్పటికీ తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

devineni uma
devineni uma

By

Published : Feb 6, 2020, 5:48 PM IST

రైతులతో మాట్లాడుతున్న దేవినేని ఉమ

రాజధాని అమరావతి ప్రాంతంలోని తుళ్లూరులో రైతుల ఆందోళనకు తెదేపా నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, బచ్చుల అర్జునుడు మద్దతు తెలిపారు. రైతుల నిరాహార దీక్షా స్థలికి వెళ్లి వారితో మాట్లాడారు. తెలంగాణకు ప్రయోజనం చేకూర్చేలా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని దేవినేని ఉమ విమర్శించారు. హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం పెంచేందుకే అమరావతిని జగన్ చంపేశారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్ల కియా పరిశ్రమ తమిళనాడు వెళ్లేందుకు సిద్ధమవుతోందని చెప్పారు.

అక్రమ కేసులు

అమరావతి కోసం పోరాడుతున్న వారిపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని దేవినేని ఉమ మండిపడ్డారు. తమ పోరాటానికి మద్దతు తెలపాలని అడిగినందుకు 14 మంది యువకులపై వైకాపా ఎంపీ నందిగం సురేశ్‌ అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు. కేసులతో అమరావతి ఉద్యమాన్ని అణిచేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని అన్నారు. తనపైనే వారంలో 5 అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. అంతేకాకుండా చంద్రబాబును, తనను జైలుకు పంపేందుకు సీఎం జగన్ యత్నిస్తున్నారని దేవినేని ఉమ వ్యాఖ్యానించారు.

షరీఫ్​కు రూ.50 కోట్లు ఎర

మండలిలో 3 రాజధానుల బిల్లు ఆమోదానికి వైకాపా అడ్డదారులు తొక్కిందని దేవినేని ఉమ రైతులతో అన్నారు. ఒక్కో తెదేపా ఎమ్మెల్సీకి రూ.25 కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టారని... మండలి ఛైర్మన్ షరీఫ్‌కు రూ.50 కోట్లు ఇస్తామని ఎరచూపారని ఆరోపించారు. ప్రలోభాలకు లొంగకుండా ఛైర్మన్ షరీఫ్, తెదేపా ఎమ్మెల్సీలు, ప్రజల పక్షాన నిలబడ్డారని ప్రశంసించారు.

విశాఖలో భూదందా

రైతుల్లో చీలిక తెచ్చేందుకే ఎంపీ కృష్ణదేవరాయలను అమరావతి పంపారని దేవినేని అభిప్రాయపడ్డారు. అలాగే విశాఖలో పేదల భూములను వైకాపా నేతలు కొట్టేస్తున్నారని విమర్శించారు. విశాఖలో ఇప్పటివరకు 52 వేల ఎకరాలు చేతులు మారాయని... 32 వేల ఎకరాలు విజయసాయిరెడ్డి చేతుల్లోకి వచ్చిందని దేవినేని ఉమ ఆరోపించారు. అమరావతి కోసం చంద్రబాబు సహా మేమంతా జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమని స్పష్టం చేశారు. అమరావతి రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తేల్చిచెప్పారు.

ఇదీ చదవండి:

'కియా' ఎక్కడికీ వెళ్లడంలేదు... అన్నీ తప్పుడు కథనాలే: మంత్రి బుగ్గన

ABOUT THE AUTHOR

...view details