ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM Jagan: వాలంటీర్ల సేవా భావానికి సెల్యూట్‌: సీఎం జగన్​ - పల్నాడు జిల్లా లేటెస్ట్ అప్​డేట్స్

CM Jagan: అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతిఒక్కరి ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. నరసరావుపేటలో వాలంటీర్ల పురస్కారాల ప్రదానోత్సవంలో సీఎం జగన్ పాల్గొన్నారు.

cm awards to volunteers
cm awards to volunteers

By

Published : Apr 7, 2022, 1:45 PM IST

Updated : Apr 8, 2022, 5:30 AM IST

CM Jagan: ‘సమాజంలో తమకు వచ్చేది ఎంత అని లెక్కవేసుకునే రోజుల్లో తాము చేసే సేవ ఎంత అని లెక్కవేసుకుని పేదల కళ్లలో సంతోషాన్ని, సంతృప్తిని చూస్తున్న.. గుండెల నిండా మానవతావాదాన్ని నింపుకొన్న 2.60 లక్షల మంది వాలంటీర్ల మహాసైన్యానికి సెల్యూట్‌ చేస్తున్నా’ అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. లంచాలు, వివక్ష, కులాలు, మతాలు, రాజకీయాలు, పార్టీలకు అతీతంగా ఒక వ్యవస్థను తీసుకురావాలన్న కల వాలంటీర్ల వల్ల సాకారమైందన్నారు. మూడేళ్లుగా రాష్ట్రంలో గొప్ప వ్యవస్థ నడుస్తుండటంతో దేశమంతా ఇటువైపు చూస్తోందన్నారు. ఈ సేవలను అందిస్తున్న గొప్ప సేవకులు, సైనికులు వాలంటీర్లని కొనియాడారు. నరసరావుపేటలోని క్రీడా ప్రాంగణంలో గురువారం ఉత్తమ వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర అవార్డులు, నగదు పురస్కారం పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. వాలంటీర్లకు నగదు పురస్కారాల సొమ్మును బటన్‌ నొక్కి విడుదల చేశారు.

స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సభలో సీఎం ప్రసంగించారు. ‘ప్రభుత్వమంటే కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరగాలనే భ్రమలను కొట్టిపారేసి.. లంచాలు ఇస్తే తప్ప పనులు జరగవనే పాత నమ్మకానికి పాతర వేసి పారదర్శకమైన పాలనకు వాలంటీర్లు, సచివాలయాల సేవలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. 2019 జూన్‌ నుంచి 2022 మార్చి వరకు వాలంటీర్లు పింఛన్ల రూపంలో రూ.50,508 కోట్లు పంపిణీ చేశారు. అభివృద్ధి అంటే ఇది కాదా? 33 పథకాలు పారదర్శకంగా ప్రతి అర్హుడికీ అందుతున్నాయి. ఇంతకన్నా గొప్ప పాలన, గొప్ప పరిస్థితులు గతంలో ఎప్పుడైనా చూశామా? వాలంటీర్లు, సచివాలయాల ద్వారా అవినీతి లేని వ్యవస్థ సాకారమవుతోంది. వాలంటీర్ల సేవలకు చిరు సత్కార కార్యక్రమాన్ని 20 రోజుల పాటు కొనసాగిస్తాం. రాష్ట్రంలో 2.28 లక్షల మందికి సేవామిత్ర, 4,136 మందికి సేవారత్న, 875 మందికి సేవావజ్ర అవార్డులు ఇస్తున్నాం. ఇందుకు రూ.239 కోట్లు వెచ్చిస్తున్నాం’ అని ప్రకటించారు.

డిపాజిట్లు దక్కవనే బాధ..:నవరత్నాల పాలన కొనసాగితే డిపాజిట్లు దక్కవన్న బాధ, ఏడుపు ప్రతిపక్ష పార్టీ, దానికి అనుబంధంగా ఉన్న పార్టీల్లో కనిపిస్తోందని జగన్‌ ధ్వజమెత్తారు. ‘ప్రజలకు మంచి చేస్తుంటే కలిసికట్టుగా, దుర్మార్గంగా బురద జల్లుతున్నారు. సంక్షేమ పథకాలు కొనసాగితే ప్రతిపక్ష పార్టీల బాక్సులు బద్దలవుతాయని వారికి తెలుసు. నాయకులు, మీడియా, అనుబంధ పార్టీలు, వీరంతా మన రాష్ట్రం శ్రీలంక అవుతుందని కొత్త ప్రచారాన్ని అందుకున్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోని దుర్మార్గుల ముఠా, ఎన్నికలప్పుడు పచ్చి అబద్ధాలు చెప్పిన దొంగల ముఠా, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేసి ఎన్నికల ప్రణాళికను చెత్తబుట్టలో వేసి పత్తా లేకుండా హైదరాబాద్‌లో నివాసం ఉన్న దొంగల ముఠా అంతా కలిసి జగన్‌ పాలన ఇలాగే సాగితే భవిష్యత్తులో తమకు ఏ ఒక్కరూ ఓటు వేయరేమోనని భయపడుతున్నారు. పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందట... ఎన్నికలప్పుడు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయకపోతే అమెరికా అవుతుందట! పేదలకు మంచి చేస్తే శ్రీలంక అవుతుందట.. వాళ్లలా ప్రజలకు వెన్నుపోటు పొడిస్తే అమెరికా అవుతుందట!! ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్‌ ఉన్నా గతంలో ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా వివక్ష, పక్షపాతానికి తావులేకుండా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఏరోజూ డబ్బులు వేయలేదు. ఆ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటో ఒక్కసారి ఆలోచించండి’ అని ప్రజలను కోరారు.

మారీచులతో యుద్ధం..:‘చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పేదలు, అక్కచెల్లెళ్లను ద్వేషిస్తుంటే మనుషులు అనాలా? మనుషుల రూపంలో ఉన్న దెయ్యాలు అనాలా? రాష్ట్రానికి కావాల్సిన పనులపై దిల్లీ వెళ్లి ప్రధానమంత్రి మోదీతో సమావేశమైతే జీర్ణించుకోలేని వారిద్దరూ జగన్‌కు క్లాసు తీసుకున్నారని ప్రచారం చేస్తున్నారు. వీళ్ల అసూయకు మందు లేదు. అసూయ పడితే బీపీ వచ్చి గుండెపోటుతో పోతారు. నీతిగా ఉన్న రాజకీయ నాయకులతో కాకుండా మారీచులతో యుద్ధం చేస్తున్నాం. విడివిడిగా పోటీచేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే మంచిదని అనుకుంటే చీలుస్తారు. వారికి గిట్టని ప్రభుత్వం ఏదైనా ఉంటే వ్యతిరేక ఓటు చీలకూడదనుకుంటే వీళ్లంతా ఏకమై దుష్ప్రచారం చేయడంలో సాటిలేదు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పి అదే నిజమని నమ్మించే గొప్ప మారీచులతో యుద్ధం చేస్తున్నామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు పార్టీలు అయినా వారంతా గజదొంగల ముఠా. వారికి నీతి, నియమం, న్యాయం, ధర్మం లేవు. ప్రజలంటే ప్రేమ లేదు. అధికారం తప్ప వేరే ఎజెండా లేదు. ఇలాంటి రాక్షసులతో యుద్ధం చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నాం. వీరు చేసే దుర్మార్గపు ప్రచారాలను నమ్మవద్దు’ అని ప్రజలను కోరారు. అంతకుముందు నరసరావుపేటలో కాసు వెంగళరెడ్డి విగ్రహాన్ని సీఎం జగన్‌ ఆవిష్కరించారు. వేదిక వద్ద నుంచి నరసరావుపేటలో గడియారస్తంభాన్ని ప్రారంభించారు. వేదిక వద్ద సచివాలయ సిబ్బందితో మాట్లాడారు. ఉత్తమ వాలంటీర్ల అవార్డు పొందినవారితో కరచాలనం చేసి ఫొటో దిగారు. నరసరావుపేటకు వెటర్నరీ కళాశాల, ఆటోనగర్‌, ఫ్లైఓవర్‌ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Suicide: చిత్తూరు జిల్లాలో విషాదం.. వైకాపా నేత పార్థసారథి ఆత్మహత్య

Last Updated : Apr 8, 2022, 5:30 AM IST

ABOUT THE AUTHOR

...view details