‘చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసిన మేలేమిటి? ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే సంక్షేమ పథకం ఒక్కటైనా ఉందా?’ అని ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటు పథకం ఒక్కటే గుర్తుకు వస్తుందని విమర్శించారు. ఎన్నికల హామీలకు తెదేపా ఏం విలువ ఇచ్చిందో, తామెంత విలువ ఇస్తున్నామో ప్రజలందరూ చూస్తున్నారన్నారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ.. ‘34 నెలలు ఎలా పాలించాం? ఎన్నికల హామీలు అమలు చేశామా? లేదా? అనేందుకు సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక సంస్థలు, ఇతర ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనం. కొవిడ్‌తో కష్టాలెదురైనా జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని తీర్పునిచ్చారు’ అని వెల్లడించినట్లు ఈనాడు పత్రికలో ప్రచురితమైంది.
ప్రజలు నష్టపోతున్నారని తెలిసినా..
‘రాజధానిని వికేంద్రీకరిస్తామంటే చంద్రబాబుకు పట్టదు. తన భూములు, తనవారి భూములు, వాటి ధరలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోరు. ప్రజా ప్రభుత్వానికి, ప్రజల సభ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏ కోర్టులోనైనా తీర్పు వస్తే సంతోషించేవారు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబే. మనం చేస్తున్న కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలన వికేంద్రీకరణ కావాలంటున్నారు. చంద్రబాబు బావమరిది బాలకృష్ణ హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలంటారు. కుప్పం రెవెన్యూ డివిజన్ చేయాలని చంద్రబాబు అడుగుతున్నారు. తన పాలనలో చేయకుండా మనల్ని అడుగుతున్నారంటే ఎవరికి ఎంత విజన్ ఉందో ప్రజలకు అర్థమవుతుంది’ అని ముఖ్యమంత్రి వివరించారు.
ఏ గ్రామాన్నైనా తీసుకుని పోల్చండి
‘రాష్ట్రంలో ఏ గ్రామాన్నైనా తీసుకుని 2014-19 వరకు, 2019-22కి మధ్య ఒక్కసారి పోల్చి చూడండి. కుప్పం పురపాలక, నియోజకవర్గంలో ఎవరి పాలన బాగుందో ప్రజలను అడగండి. గత ప్రభుత్వంలో పార్టీ, కులం, మతం చూడకుండా ఏ పథకాన్నైనా అమలు చేశారా? లంచం లేకుండా ఒక్క పథకాన్నైనా ఇచ్చారా? ప్రజలకు కావాల్సింది జన్మభూమి కమిటీలా? పారదర్శకమైన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థా? ఒకటో తేదీనే పింఛను ఇవ్వడంపై చంద్రబాబు ఏనాడైనా ఆలోచించారా? సాధారణ ఎన్నికలకు 2 నెలల ముందు వరకు ఇచ్చిన పింఛను రూ.వెయ్యి. ఈ రోజు రూ.2,500 ఇస్తున్నాం. చంద్రబాబుకు గ్రామమంటే గౌరవం లేదు’ అని విమర్శించారు.
ప్రభుత్వ బడులను చంపాలని చూశారు
‘ప్రభుత్వ బడులను చంపేయాలని చంద్రబాబు ప్రయత్నించారు. ఇంకో ఐదేళ్లుంటే అన్ని మూసేసేవారు. పేద పిల్లలు తెలుగు మాధ్యమంలో, తమ పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదవాలన్నది మంచిదా? అందరికీ ఉచితంగా ఆంగ్ల మాధ్యమం అందిస్తున్న మా విధానం మంచిదా? అని అడుగుతున్నా. ప్రభుత్వ బడులకు వైభవానికి కష్టపడుతున్నాం’ అని జగన్ పేర్కొన్నారు.
జెండాలోనే గుడిసె ఉంది..