కొవిడ్ నివారణకు క్షేత్రస్థాయిలో పక్కా వ్యూహాలు అమలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 90 రోజుల్లో స్క్రీనింగ్, కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్దేశించారు. వైరస్‌పై ప్రజలకు భయం పోగొట్టేలా... విస్తృత ప్రచారం చేయాలని నిర్దేశించారు.
ప్రతి కుటుంబానికి స్క్రీనింగ్ పరీక్షలు
వచ్చే 3 నెలల్లో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి స్క్రీనింగ్, కరోనా పరీక్షలు నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. కొవిడ్ వ్యాప్తి, నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించిన సీఎం... కరోనా నిర్ధరణకు నమూనాలు సేకరించే సదుపాయాలున్న 104 వాహనాలను ప్రతి మండలానికీ ఒకటి మంజూరు చేయాలన్నారు. 104 సిబ్బంది సహా... అదే గ్రామానికి చెందిన ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, వాలంటీర్లను ఒక బృందంగా ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించడానికి పరీక్షలు నిర్వహించి మందులు అక్కడే ఇవ్వాలన్నారు. ప్రతి నెలలో కనీసం ఒకసారి గ్రామాల్లో 104 వాహనం ద్వారా వైద్యసేవలు, స్క్రీనింగ్ జరిగేలా చూడాలని ఆదేశించారు. పరీక్షల వివరాలను క్యూఆర్ కోడ్ ఉన్న ఆరోగ్యకార్డులో పొందుపరచాలని సూచించారు. పట్టణాల్లో ప్రత్యేక వ్యూహం అమలు చేయాలని ఆదేశించారు.
ప్రజలు భయాందోళనలు తొలగించాలి
క్షేత్రస్థాయిలో బలమైన వ్యవస్థల ద్వారానే కరోనా వ్యాప్తిని అడ్డుకోగలమని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రజల్లో అవగాహన, చైతన్యం కల్పించడం ద్వారా వైరస్‌ను అడ్డుకోగలమన్నారు. కంటైన్‌మెంట్ క్లస్టర్లలో 50 శాతం పరీక్షలు చేయాలని... మిగతా 50 శాతంలో తమకు తాముగా కొవిడ్ పరీక్షల కోసం ముందుకు వచ్చేవారికి, కాల్ సెంటర్ ద్వారా సమాచారం ఇచ్చేవారికి చేయాలన్నారు. వైరస్ వ్యాప్తికి అవకాశం ఉన్న హైరిస్క్ రంగాలు, గ్రూపుల్లోనూ పరీక్షలు చేయాలని సీఎం జగన్ సూచించారు. ప్రజల్లో భయాందోళనలు తొలగించేలా అవగాహన కల్పించాలన్నారు. కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారం ఉద్ధృతం చేయాలని ఆదేశించారు.
జులై 1 నాటికి అంతా సిద్దం