గులాబ్ తుపాను బాధిత రైతులకు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) రూ.22 కోట్ల నిధులు విడుదల (Release of crop damage compensation) చేశారు. పంటలు దెబ్బతిన్న 34,586 మంది రైతులకు ఈ సాయాన్ని అందజేయాలని సూచించారు. రాష్ట్రంలో 62 శాతం జనాభా.. రైతు వృత్తిలోనే ఉన్నారని సీఎం తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం వస్తే అదే సీజన్ ముగిసేలోగా పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
గులాబ్ తుపాను (Gulab cyclone) బాధిత రైతులకు..రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ పరిహారాన్ని విడుదల చేశారు. పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు రూ.22 కోట్లు పరిహారం మొత్తాన్ని కంప్యూటర్ బటన్ నొక్కి సీఎం విడుదల చేశారు. రాష్ట్రంలో 62 శాతం జనాభా రైతు వృత్తిలో ఉన్నారన్న సీఎం...రైతు ఇబ్బంది పడితే గ్రామీణ ఎకానమీ రోడ్డున పడుతుందన్నారు. ఈ విషయం తెలిసినా..గత ప్రభుత్వం ఎనాడూ రైతు సమస్యలు పరిష్కరించలేదన్నారు. రైతులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ప్రభుత్వం విప్లవాత్మక అడుగులు వేస్తోందన్నారు. రైతులకు అన్ని విధాలా మంచి జరగాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. తుపానులు, వరదలు, కరవు వచ్చినా..రైతులు నష్టపోకూడదన్న జగన్.. నష్టం వస్తే అదే సీజన్ ముగిసేలాగా పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరిహారం అందించే విషయంలో సరికొత్త సాంప్రదాయాన్ని తీసుకువచ్చామన్నారు.
తమది రైతు పక్షపాత ప్రభుత్వమని సీఎం జగన్ వ్యాఖ్యనించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో 18 లక్షల ఎకరాల్లో పంట నష్టపోగా..13.96 లక్షల రైతులకు రూ. 1,070 కోట్ల పరిహారం ఇచ్చామన్నారు. రెండున్నరేళ్లలో పలు పథకాల ద్వారా రూ.18,777 కోట్లు రైతుల చేతుల్లో నేరుగా పెట్టామన్నారు. విత్తనం నుంచి అమ్మకం వరకు రైతుకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉందన్న సీఎం..పంట కొనుగోలు చేసేందుకు ఆర్బీకే కేంద్ర బిందువుగా పని చేస్తుందన్నారు. రెండున్నరళ్లలో ధాన్యం సేకరణ కోసం గతంలో ఎప్పుడూ జరగని విధంగా 35 వేల కోట్లు వెచ్చించామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైతులు పండించిన ఇతర పంటల కొనుగోలు కోసం రూ. 6,434 కోట్లు వ్యయం చేశామన్నారు. రూ.2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి, రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామన్నారు. రైతులకు తోడుగా ఉండేందుకే వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చామన్నారు. ఇటీవల రాయలసీమ, నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయన్న జగన్.. వర్షాల వల్ల పంట నష్టపోతే రైతులెవరూ భయపడాల్సిన పనిలేదని, నష్టపోయిన ప్రతి రైతుకూ రబీ సీజన్ ముగిసేలోగా పరిహారం అందిస్తామని ప్రకటించారు.