నేటి నుంచి మూడ్రోజుల పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకొని... అక్కడి నుంచి హెలికాప్టర్లో 11 గంటలకు జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె-పెద్దదండ్లూరుకు చేరుకుంటారు. "ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్" ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు.
ఈ పరిశ్రమ కోసం ఇప్పటికే 3వేల 148 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. దీన్ని రెవిన్యూ అధికారులు 4 రోజుల కిందటే ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్‌కు అప్పగించారు. వారం కిందటే ఉక్కు పరిశ్రమకు అవసరమైన ఇనుప ఖనిజం తరలించారు. రెండ్రోజుల కిందటే గండికోట జలాశయం నుంచి పరిశ్రమకు అవసరమైన నీటిని కేటాయిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
విభజన తర్వాత కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చట్టంలో పొందుపరిచినా... కేంద్రం పట్టించుకోలేదు. జిల్లా వాసుల కల నెరవేర్చేందుకు 2018 డిసెంబర్ 27న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎం.కంబాలదిన్నె వద్ద ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో దీన్ని పూర్తి చేయాలని సంకల్పించారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఇది మరుగున పడింది.
గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన బ్రహ్మణీ స్టీల్స్‌కు-2007 జూన్ 10న అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి.. చిటిమిటిచింతల వద్ద శంకుస్థాపన చేశారు. 2009లో రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత అదీ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో మూడోసారి జమ్మలమడుగు ప్రాంతంలోనే ఉక్కు పరిశ్రమకు సీఎం జగన్ నేడు శంకుస్థాపన చేయనున్నారు.