మూడు రాజధానుల ఏర్పాటుపై ముందుకే వెళ్లాలని ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు సంబంధించిన బిల్లులకు.. వైకాపా సర్కారు తుది రూపునిస్తోంది. రేపు ఉదయం 11 గంటలకు శాసన సభ సమావేశం ప్రారంభం కానుంది. అంతకు ముందే ఉదయం 9 గంటలకు సచివాలయంలో మంత్రివర్గం భేటీ అవుతుంది. శాసన సభలో ప్రవేశ పెట్టనున్న బిల్లులపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదించనున్నారు. రేపు ఎన్ని బిల్లులు సభలో ప్రవేశపెడతారు? వాటిలో ఏయే అంశాలు ఉంటాయనే విషయమై ఉత్కంఠ నెలకొంది.
రేపు ఉదయం అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులను ప్రభుత్వం అత్యంత గోప్యంగా ఉంచుతోంది. న్యాయపరంగా ఇబ్బందులు కలగకుండా ఉండేలా బిల్లును రూపొందిస్తున్నట్లు తెలిసింది. బిల్లులోని అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. శాసనసభ, శాసన మండలిలోనూ బిల్లులను నెగ్గించుకునేందుకు ప్రత్యేక వ్యూహాన్ని ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. శాసనసభలో వైకాపాకు సంపూర్ణ మెజారిటీ ఉంది. 151 మంది ఎమ్మెల్యేలతో పాటు తెలుగుదేశం నుంచి దూరంగా ఉన్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వైకాపాకు మద్దతిచ్చే అవకాశాలున్నాయి. ఫలితంగా.. శాసనసభలో బిల్లులన్నీ ఆమోదం పొందనున్నాయి.
'మండలిలో ఏం చేద్దాం?'
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పలువురు మంత్రులతో ఆదివారం సీఎం జగన్ భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మండలిలో చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో చర్చించారు. మండలిలో వైకాపాకు బలం తక్కువగా ఉన్నందున.... అక్కడ బిల్లులను ఎలా గట్టెకించాలన్న విషయంపైనే మాట్లాడుకున్నారని సమాచారం.