గ్రామాల్లో తొలి దశలో నిర్మిస్తున్న డిజిటల్ లైబ్రరీలను ఉగాదినాటికి అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2022 డిసెంబరు నాటికి రెండో దశ, 2023 జూన్ నాటికి మూడో దశ నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలోని 12,979 గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్ గ్రామీణ డిజిటల్ లైబ్రరీలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించగా, తొలి దశలో 4,530 గ్రామాల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటి పురోగతిని శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. వచ్చే జనవరి నాటికి తొలి దశ డిజిటల్ లైబ్రరీల నిర్మాణం పూర్తవుతుందని అధికారులు చెప్పగా...
వాటిలో కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లతో పాటు, అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి ఉగాది నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని సీఎం ఆదేశించారు. ప్రతి డిజిటల్ లైబ్రరీలో డెస్క్‌టాప్ కంప్యూటర్లు, సిస్టమ్ చైర్లు, ప్లాస్టిక్ కుర్చీలు, ఫ్యాన్‌లు, ట్యూబ్‌లైట్‌లు, ఐరన్ ర్యాక్‌లు, పుస్తకాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రతి గ్రామీణ లైబ్రరీకి అంతరాయం లేని బ్యాండ్‌విడ్త్‌తో కూడిన ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని కోరారు.