తిరుపతి ఉపఎన్నిక సహా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. తిరుపతి లోక్సభ పరిధిలోకి వచ్చే వైకాపా ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరయ్యారు. త్వరలో తిరుపతి ఎంపీ స్థానానికి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రతిపక్ష తెదేపా మాజీ మంత్రి పనబాకలక్ష్మి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. దీంతో పార్టీ వెనకబడకుండా ఉండేందుకు ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థి వీలైనంత త్వరలో ఎంపిక చేయాలని నిర్ణయించిన సీఎం జగన్.. అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేశారు.
స్థానిక ఎన్నికలపై సుదీర్ఘ చర్చ...
స్థానిక సంస్థలు ఎన్నికలు, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంపై మంత్రలతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. ఫిబ్రవరిలో పంచాయితీ ఎన్నికలు జరపాలని ఎస్ఈసీ నిర్ణయించగా ... కరోనా సెకండ్ వేవ్ ఉందని కారణంతో ప్రభుత్వం అందుకు అనుమతించబోమని స్పష్టం చేసింది. జిల్లా కలెక్టర్లతో ఎస్ఈసీ తలపెట్టిన వీడియో కాన్ఫరెన్సులకూ అనుమతి ఇవ్వలేదు. వీటితో పాటు మంత్రుల వ్యాఖ్యలపై గవర్నర్కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం విరుద్ధంగా వ్యవహరిస్తుందని, మంత్రులు తనను కించపరిచేలా మాట్లాడుతున్నారని తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వం తరపున ఎలా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
దూకుడుగానే ముందుకు...
నిమ్మగడ్డ విషయంలో దూకుడుగానే ముందుకు వెళ్లాలని ఎక్కడా వెనకడుగు వేయకూడదని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. సమావేశం అనంతరం బయటకు వచ్చిన నేతలు నిమ్మగడ్డ రమేష్ పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అనుమతి లేకుండా ఎన్నికలను ఎలా నిర్వహిస్తారని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. నిమ్మగడ్డను తక్షణం పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.