‘అభివృద్ధి వికేంద్రీకరణ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య సమతౌల్యంతో కూడిన అభివృద్ధికి మూడు రాజధానుల చట్టం తీసుకొచ్చాం.. ఈ నిర్ణయానికి మేం కట్టుబడి ఉన్నాం.. ఈ విషయంలో మాకు సహకరించండి’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. దిల్లీలోని అమిత్ షా నివాసంలో గురువారం రాత్రి ఆయనను ముఖ్యమంత్రి కలుసుకున్నారు. రాత్రి 9.03 గంటలకు అమిత్ షా నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. 10.33 గంటలకు బయటకు వచ్చారు. వారి మధ్య సుమారు 90 నిమిషాలు భేటీ కొనసాగింది.
నోట్ విడుదల..
రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారని ముఖ్యమంత్రి కార్యాలయం నోట్ విడుదల చేసింది. దాని ప్రకారం... ‘అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటిస్తూ 2020 ఆగస్టులో చట్టం తీసుకొచ్చాం. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని 2019 ఎన్నికల సమయంలో భాజపా మేనిఫెస్టోలో పెట్టారు. హైకోర్టును కర్నూలులో పెడుతూ రీనోటిఫికేషన్ జారీ చేయండి. విభజన అనంతరం రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులకు గురైంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే కేంద్ర గ్రాంట్లు వచ్చి రాష్ట్రంపై ఆర్థికభారం తగ్గుతుంది. భారీ పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనకు ప్రత్యేక హోదా అవసరమైనందున రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించండి’ అని కోరారు. కుడిగి, వల్లూరు థర్మల్ ప్లాంట్ల నుంచి అధిక ధరలకు విద్యుత్తు కొనుగోలుకు చేసుకున్న ఒప్పందాలను సరెండర్ చేసేందుకు సహకరించాలని అమిత్ షాను ముఖ్యమంత్రి కోరారు.
డిస్కంలకు భారంగా మారింది..
అధిక ధరల వల్ల ఏటా రూ.325 కోట్లు చెల్లించాల్సి వస్తోందని, ఇది డిస్కంలకు భారంగా మారిందని తెలిపారు. తెలంగాణ డిస్కంల నుంచి రావల్సిన రూ.5,541.88 కోట్ల బకాయిలను ఇప్పించాలని కోరారు. రాష్ట్ర విద్యుత్తు రంగం రూ.50 వేల కోట్ల రుణాల్లో ఉన్నందున వాటిని రీస్ట్రక్చర్ చేయాలని విన్నవించారు. విశాఖ జిల్లా అప్పర్ సీలేరులో రివర్్్స పంప్ స్టోరేజీ విద్యుత్తు ప్రాజెక్టుకు రూ.10,445 కోట్ల వ్యయమవుతుందని, అందులో 30% నిధులు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. చౌక బియ్యం రాయితీ కింద కేంద్ర పౌరసరఫరాల సంస్థ నుంచి రాష్ట్రానికి రావల్సిన రూ.3,229 కోట్లు, ఉపాధిహామీ పథకంలో రావల్సిన రూ.4,652.70 కోట్లు, స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం కింద రావల్సిన రూ.529.95 కోట్లు, 15వ ఆర్థిక సంఘం కింద రావల్సిన రూ.497 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని అమిత్‌షాను సీఎం జగన్ కోరారు. ఉపాధి పని దినాలను 100 నుంచి 150కి పెంచాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రప్రభుత్వం కొత్తగా 13 నూతన వైద్య కళాశాలల నిర్మాణం ప్రారంభిస్తోంది. కేంద్రం ఇప్పటికే మూడు కళాశాలలకు అనుమతి ఇచ్చినందున మిగిలిన వాటితో పాటు నర్సింగ్ కళాశాలలకూ అనుమతులు ఇచ్చి ఆర్థిక సహాయం చేయాలి.
- కేంద్రమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్
బిల్లుల ఆమోదం... గిరిజన విశ్వ విద్యాలయం
రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన పంపిన దిశ బిల్లును వెంటనే ఆమోదించాలని అమిత్ షాను జగన్ కోరారు. రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రారంభించామని, రికార్డులు డిజిటలైజ్ చేస్తున్నందున ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ బిల్లు-2020కి ఆమోదం లభించేలా చూడాలని కోరారు. గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటుకు విజయనగరం జిల్లా సాలూరు సమీపంలో 250 ఎకరాల భూమిని గుర్తించామని తెలిపారు. అక్కడ వెంటనే విశ్వవిద్యాలయం ఏర్పాటుచేయాలని కోరారు.