రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొవిడ్ వ్యాప్తి గణనీయంగా తగ్గినందున కర్ఫ్యూను తొలగిస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. కర్ఫ్యూ తొలగించినా.. కొవిడ్ బారిన పడకుండా మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కొవిడ్‌పై ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశానికి ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, కొవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ టీ.కృష్ణబాబు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియను అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి గణనీయంగా తగ్గిందని.., పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. యాక్టివ్ కేసుల రేటు 0.82 శాతానికి పడిపోయిందన్నారు. గత వారం 1 లక్ష 622 పాజిటివ్ కేసులు ఉండగా.., ఇప్పుడు 18 వేల 929కి పడిపోయాయని తెలిపారు. వీటిలో ఆస్పత్రిలో 794 మంది చేరగా.. వారిలో కేవలం 130 మంది ఐసీయూలో ఉన్నారన్నారు. అన్ని జిల్లాల్లోనూ కేసులు గణనీయంగా తగ్గాయన్నారు.
దీంతో రాత్రిపూట కర్ఫ్యూ తొలగించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ప్రజలంతా మాస్క్‌లు కచ్చితంగా ధరించేలా మార్గదర్శకాలు కొనసాగాలని ఆదేశించారు. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలన్నారు. ఫీవర్ సర్వే కొనసాగించాలన్న సీఎం..లక్షణాలు ఉన్నవారికి టెస్టుల ప్రక్రియ కొనసాగించాలన్నారు. వాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా కొనసాగించాలని ఆదేశించారు. రాష్ట్రంలో 3 కోట్ల 90 లక్షల 83 వేల 148 మందికి రెండు డోసులు టీకాలు వేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. 39 లక్షల 4 వేల 927 మందికి ఒక డోసు మేర వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు తెలిపారు. మొత్తంగా 8 కోట్ల 32 లక్షల 55 వేల 831 డోసులు వాక్సిన్లు ఉపయోగించినట్లు వివరించారు.