మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతీ సంప్రదాయాలకు, సొంత గ్రామాలమీద మమకారానికి, రైతాంగానికి మనమంతా ఇచ్చే గౌరవానికి సంక్రాంతి పండుగ ప్రతీక అని అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న మాటకు కట్టుబడ్డామని, దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని రీతిలో గత 19 నెలలుగా రైతన్న సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని... ఇకమీదటా ఇదే విధానం కొనసాగుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
కష్టనష్టాలన్నీ అంతం కావాలి: చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు తెలుగు ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగలన్నీ కుటుంబ సభ్యులతో ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. భోగిమంటల్లో కష్టనష్టాలన్నీ అంతం కావాలన్నారు. రంగవల్లులతో సంక్రాంతిని స్వాగతించడం, పెద్దలను స్మరించుకోవడం, కనుమ నాడు వ్యవసాయ నేస్తాలైన పశువులను పూజించడం అనాదిగా వస్తున్న సంప్రదాయమని పేర్కొన్నారు. చెడును అంతం చేసి మంచి వైపు మన ప్రయాణమే సంక్రాంతి అని తెలిపారు. అన్నివర్గాల ప్రజల అభివృద్దికి, సమాజ హితానికి ఈ సంక్రాంతి శుభకరం కావాలని పేర్కొన్నారు. ప్రతీ తెలుగింటా సంతోషాలు నిండుగా భోగి, సంక్రాంతి, కనుమ పండగలు జరుపుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకశ్ ఆకాంక్షించారు.
ఇదీ చదవండి :ఎస్‌ఈసీ రిట్ అప్పీల్ పిటిషన్.. విచారణ 18కి వాయిదా