బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన వైకాపా అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ, పార్టీ నేతలను ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంను మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, విప్ కొరుముట్ల శ్రీనివాసులు కలిశారు. ఈ సందర్భంగా నేతలను సీఎం అభినందించారు.
బద్వేలులో గెలిచిన సుధకు అభినందనలు. అఖండ విజయం అందించిన బద్వేలు ప్రజలకు కృతజ్ఞతలు. దేవుడి దయ, అందరి చల్లని దీవెనల వల్లే ఘనవిజయం సాధ్యమైంది. బద్వేలు గెలుపును సుపరిపాలనకు దీవెనలుగా భావిస్తాం - సీఎం జగన్
సీఎం జగన్ మెజార్టీ కంటే అధికం..
ఉప ఎన్నికలో గెలిచిన డాక్టర్ సుధ.. మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. 2019 ఎన్నికల్లో పులివెందుల నుంచి గెలిచిన జగన్ (90,110) మెజార్టీని బ్రేక్ చేసింది. ఈ ఉప ఎన్నికలో సుధకు 90,533 ఆధిక్యం దక్కింది.
ప్రజలకు ధన్యవాదాలు: వైకాపా అభ్యర్థి సుధ
నియోజకవర్గ ప్రజలకు వైకాపా అభ్యర్థి సుధ.. ధన్యవాదాలు తెలిపారు. అవకాశమిచ్చిన సీఎం జగన్‌కు.. విజయానికి సహకరించిన నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికే తన మెుదటి ప్రాధాన్యమని అన్నారు.
ఆ మూడు పార్టీలు ఒకటే:సజ్జల
‘బద్వేలులో అభ్యర్థి భాజపా నుంచే ఉన్నా.. భుజాలపై మోసింది, ఎన్నికల మంత్రాంగం చేసింది తెదేపా, మద్దతునిచ్చింది జనసేన. ఆ మూడు పార్టీలూ ఒకటే’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘బద్వేలులో మొత్తం 281 పోలింగ్ కేంద్రాలకు ఏదో పదింటిలో భాజపా ఏజెంట్లు కూర్చుంటే మిగతా అన్నిచోట్లా తెదేపా వాళ్లే ఏజెంట్లుగా ఉన్నారు. ఇవిగో సాక్ష్యాలు (ఫొటోలు చూపిస్తూ). 2019 ఎన్నికల్లో భాజపాకు 800కు మించని ఓట్లు ఇప్పుడు 20వేలకు పైగా ఎలా వచ్చాయి?’ అని ప్రశ్నించారు. మంగళవారం ఆయన వైకాపా కేంద్రకార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ‘కుప్పంలో చంద్రబాబు సభకు వచ్చిన ఒక ప్రభుత్వ ఉద్యోగిపై తెదేపా కార్యకర్తలు దాడిచేస్తుంటే కనీసం వారించకపోగా బాంబులు తెచ్చారన్నారంటే ఎంత దిగజారిపోయారో తెలుస్తోంది’ అని విమర్శించారు.
పాదయాత్ర.. రెచ్చగొట్టే చర్య
‘మళ్లీ ఒక రెచ్చగొట్టే చర్యను మహా పాదయాత్ర రూపంలో చంద్రబాబు మొదలుపెట్టారు. అక్కడకు వెళ్లినవారంతా ఉత్తరాంధ్రకు వెళ్లి మీరంతా అమరావతినే రాజధానిగా అంగీకరించాలని చెప్పగలరా? ఎక్కడైనా ఆవేశాలు వచ్చి అటో ఇటో జరిగితే అరాచకం సృష్టించాలని, దాంతో రాజకీయ ప్రయోజనం వస్తుందేమో చూడాలని కాదా? అమరావతి నుంచి రాజధానిని తీసేయలేదే? రాయలసీమలో, ఉత్తరాంధ్రలో అమరావతే రాజధానిగా ఉండాలనుకునే పరిస్థితి ఉంటే అక్కడే పాదయాత్ర చేయించవచ్చు కదా? న్యాయస్థానం-దేవస్థానం అంటే పక్కనే కనకదుర్గమ్మ ఉంది అక్కడకు పోవచ్చు, ఆమె దేవత కాదా? వీళ్లు వెళ్లే దారిలో ఎవరైనా ప్రశ్నిస్తే, రాయలసీమ అభివృద్ధి చెందకూడదా అని అడిగితే, అప్పుడు ఎవరిది తప్పవుతుంది? నిన్న మొదలుపెట్టిన చోట ప్రశాంతంగా చేసినట్లుందా? రాజకీయ క్రీడగా కనిపించడం లేదా? అమరావతిలో ఎస్సీలు, మైనారిటీలు, బడుగువర్గాలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అడ్డుకున్నారే.. అమరావతి అంటే కొద్దిమంది కోసం పెట్టుకున్నదా? రియల్‌ఎస్టేట్ వెంచరా?’ అని సజ్జల ప్రశ్నించారు.
భాజపాను నడిపించింది తెదేపానే..
బద్వేలు ఉప ఎన్నికలో వైకాపా సాధించిన ఘన విజయం తమపై మరింత బాధ్యతను పెంచిందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల అమలు తీరుకు ఈ విజయం నిదర్శనమన్నారు. ఇది బడుగు బలహీన వర్గాలు, సామాన్యుడి విజయమని చెప్పారు. పోటీ చేయడంలేదని చెప్పిన తెదేపా వెనుక ఉండి భాజపాను నడిపించిందని ఆరోపించారు. ఇప్పటికైనా విభజన చట్టంలోని ప్రత్యేక హోదా హామీని కేంద్రం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బలహీన పరిచేందుకు ప్రతిపక్షాలు కుట్రపన్నుతున్నాయన్నారు.
ఇదీ చదవండి:
Badvel Bypoll Result: బద్వేలు ఉప ఎన్నికలో ఫ్యాన్ జోరు.. మెజార్టీ ఎంతంటే..