వైఎస్సార్ జగనన్న కాలనీల విస్తీర్ణం ఆధారంగా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఉద్యానాలు, గ్రామ, వార్డు సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్ తదితర సదుపాయాలు సమకూర్చాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ‘రహదారులు, విద్యుత్తు స్తంభాలు, వీధి దీపాలు, కాలనీల స్వాగత తోరణాలను వినూత్న రీతిలో నిర్మించాలి. ప్రతి కాలనీ వెలుపల హైటెక్ రీతిలో బస్టాప్ ఉండాలి. భూగర్భ మురుగునీటి వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టాలి’ అని సూచించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో ముఖ్యమంత్రి జగన్ దృశ్యమాధ్యమం ద్వారా సమీక్షించారు.
ఇళ్ల నిర్మాణంలో మన ముద్ర కన్పించాలి
‘ఇప్పటివరకు 39% ఇళ్ల స్థలాలు పంపిణీ చేశాం. 17 వేలకుపైగా వైఎస్సార్ జగనన్న కాలనీలు ఉండగా 9,668 కాలనీల్లో పంపిణీ పూర్తైంది. ఈ నెల 20 వరకు ఈ కార్యక్రమం కొనసాగిస్తాం. అప్పటికల్లా ఇళ్ల నిర్మాణంపై లబ్ధిదారుల ఆప్షన్ల ఎంపిక పూర్తి కావాలి. దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో అర్హులకు ఇళ్ల పట్టాలు అందించాలి. అనర్హులెవరికీ అందకూడదు’ అని సీఎం స్పష్టం చేశారు. ‘కోర్టు కేసుల వల్ల ఇళ్ల స్థలాల పంపిణీ ఆగిపోయిన ప్రాంతాల్లో లబ్ధిదారులకు భరోసా కల్పిస్తూ లేఖలు ఇవ్వాలి. కేసులు పరిష్కారం కాగానే స్థలాలు అందిస్తామని చెప్పాలి. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత కీలకం. ఇందులో అవినీతిని క్షమించం. కాలనీల నిర్మాణంలో మన సంతకం కనిపించాలి’ అని సీఎం పేర్కొన్నారు.
అంగన్‌వాడీలపై ప్రత్యేక శ్రద్ధ
‘గ్రామ సచివాలయాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్ పనులను మార్చి 31లోగా పూర్తిచేయాలి. ఒక గుత్తేదారు లేదా ఏజెన్సీకి ఒక్క పనే అప్పగించాలి. ఫిబ్రవరి నెలాఖరుకు పాఠశాలల్లో నాడు-నేడు పనులు పూర్తిచేయాలి. అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణానికి స్థలాలు వెంటనే సేకరించాలి. ఈ కేంద్రాలను ప్రీ ప్రైమరీ స్కూల్సుగా మార్చబోతున్నాం. చిన్నారులకు ఆరేళ్లలోపు 85% మెదడు అభివృద్ధి చెందుతుంది. అందుకే వారిపై అత్యంత శ్రద్ధ చూపిస్తున్నాం. వారికి ఆంగ్లం సహా అన్నీ నేర్పిస్తాం’ అని అన్నారు.