ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఢోకా లేదన్న జగన్​.. మరి అప్పుల మాటేంటని నిపుణుల ప్రశ్న? - state finance position in assembly session

STATE FINANCE POSITION : రాష్ట్ర ఆర్థిక నిర్వహణ సరిగా లేదని రేటింగ్‌ సంస్థలు చెబుతున్నాయి.. ఏపీలోని ప్రభుత్వరంగ సంస్థలకు అప్పులు ఇచ్చేటప్పుడు జర జాగ్రత్త అని బ్యాంకులను కేంద్ర ఆర్థికశాఖ హెచ్చరించింది. దీంతో ఒక బ్యాంకు రుణం ఇవ్వడం ఆపేసింది. ఆర్థికశాఖ చెప్పినందునే ఎస్‌బీఐ రుణం ఇవ్వడం ఆపేసిందని.. దయచేసి అప్పు వచ్చేలా చూడండి అంటూ స్వయంగా సీఎం జగన్‌.... ప్రధానికి లేఖ రాశారు. ఏపీకి అప్పులిచ్చే తీరులో తప్పులు జరిగినట్లు రిజర్వుబ్యాంకు అంగీకరించిందని.. కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి రాజ్యసభలో చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విశ్రాంత ఐఏఎస్‌ల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేవారే లేరు. వాస్తవాలు ఇలా ఉంటే.. సీఎం మాత్రం.. రాష్ట్ర ఆర్థిక నిర్వహణ భేషుగ్గా ఉందని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

STATE FINANCE POSITION
STATE FINANCE POSITION

By

Published : Sep 17, 2022, 7:36 AM IST

Updated : Sep 17, 2022, 7:54 AM IST

STATE FINANCE : రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు, ఆర్థిక ఆరోగ్యానికి వచ్చిన ఢోకా ఏమీలేదని.. కొవిడ్‌ లాంటి మహమ్మారి వచ్చి సవాళ్లు విసిరినా ఆర్థిక వ్యవస్థను మెరుగ్గా నిర్వహిస్తున్నట్లు సీఎం జగన్‌ చెప్పారు. నిజానికి రాష్ట్ర ఆర్థిక నిర్వహణ బలహీనంగా ఉందని రేటింగు సంస్థ క్రిసిల్‌ ఆగస్టులో పేర్కొంది. అమరావతి బాండ్ల రేటింగును ప్రతికూలంగా పేర్కొంది. రిజర్వుబ్యాంకు కల్పించిన ప్రత్యేక డ్రాయింగ్‌ సదుపాయం వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సులు, ఓవర్‌ డ్రాఫ్ట్‌ వెసులుబాటుతోనే రాష్ట్రం నడుస్తోందని.. క్రిసిల్‌ స్పష్టంగా పేర్కొంది.

రాష్ట్ర ఆర్థికం అంత చక్కగా ఉంటే వేల కోట్ల బిల్లులు ఎందుకు పెండింగులో ఉన్నట్లు? ఈ బిల్లుల కోసం గుత్తేదారులు, సరఫరాదారులు న్యాయస్థానాలను ఎందుకు ఆశ్రయిస్తున్నట్లు? పింఛనర్లకు ఎప్పుడో ఇవ్వాల్సిన కరవు భత్యం బకాయిలు ఎందుకు సకాలంలో ఇవ్వట్లేదు? ఆర్థికవ్యవస్థ బాగుండి, బిల్లులు సరిగానే చెల్లిస్తే.. గుత్తేదారులు టెండర్లంటేనే ఎందుకు భయపడుతున్నారు? శ్రీశైలం ప్రాజెక్టులో కేవలం కోటి బిల్లు ఇంతవరకు ఎందుకు చెల్లించలేదు? ఉద్యోగులు దాచుకున్న సొమ్ముల నుంచి రుణాలు తీసుకోవడానికి దరఖాస్తు చేస్తే నెలల తరబడి ఎందుకు పెండింగులో ఉంచుతున్నారు? ఆర్థిక పరిస్థితి అంత బాగుంటే ప్రతినెలా 8 వేల కోట్లు, 9 వేల కోట్లు బహిరంగ మార్కెట్‌ రుణాలు ఎందుకు తీసుకుంటున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఢోకా లేదు

2014లో రాష్ట్ర విభజన నాటికి ఉన్న అప్పు లక్షా 20 వేల 556 కోట్ల రూపాయలని.. 2019 మే నెల నాటికి ఉన్న అప్పు 2 లక్షల 69 వేల 462 కోట్లు అని సీఎం జగన్‌ చెప్పారు. ఈ ఏడాది మార్చి నాటికి ప్రభుత్వ రుణం 3 లక్షల 82వేల 165 కోట్లు అని ఇవన్నీ కాగ్‌ నివేదికలోనే ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. వాస్తవానికి 2014 జూన్‌ 2 నాటికి ఏపీకి వచ్చిన అప్పు లక్షా 18 వేల 544 కోట్లు.

2019 నాటికి అది 2 లక్షల 57 వేల 509 కోట్లు అయ్యిందని కాగ్‌ తేల్చిన లెక్కలు, బడ్జెట్‌ పుస్తకాలు స్పష్టం చేస్తున్నాయి. 2022 మార్చి నెలాఖరు వరకు రాష్ట్ర అప్పు 3 లక్షల90 వేల 670 కోట్ల రూపాయలను ఉన్నట్లు బడ్జెట్‌ పుస్తకాలు చెబుతున్నాయి. తుది లెక్కలు తేలితే ఈ అప్పు 4 లక్షల 13 వేల కోట్లు ఉంటుందన్నది నిపుణుల మాట. బడ్జెట్‌ పుస్తకాల్లోని లెక్కలను కూడా కాదని ముఖ్యమంత్రి తప్పుడు లెక్కలు చెప్పారు.

2019 మే నెలలో వైకాపా ప్రభుత్వం వచ్చేసరికి ప్రభుత్వరంగ సంస్థల అప్పులు, ప్రభుత్వ గ్యారంటీలతో సహా కలిపి చేసినవి 59 వేల 257.31 కోట్ల రూపాయలు అని.. ఈ మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 2022 మార్చి నాటికి ప్రభుత్వ గ్యారంటీతో చేసిన అప్పుల మొత్తం లక్షా 17 వేల 730.33 కోట్లు అని సీఎం చెప్పారు. వాస్తవానికి రాష్ట్ర విభజన నాటికి కార్పొరేషన్ల అప్పులు రాష్ట్రంలో ఏపీ వాటాగా వచ్చినవి 13 వేల 842 కోట్లు. 2018-19లో డిసెంబరు వరకు కార్పొరేషన్ల అప్పులు 35 వేల 964 కోట్లు.

ఇప్పటివరకు రాష్ట్రంలోని 29 కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు లక్షా 15 వేల 403.58 కోట్లు. ఇవికాక ఏపీఎస్‌డీసీ ద్వారా తీసుకున్న రుణం 23 వేల 200 కోట్ల రూపాయలు. ఇవి కలిస్తే లక్షా 38 వేల 603 కోట్లు. నాన్‌ గ్యారంటీ రుణాలు 87 వేల 233 కోట్లు. అవి కాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు బెవరేజస్‌ కార్పొరేషన్‌ ద్వారా 8 వేల 300 కోట్లు రుణం తీసుకున్నారు. ఏపీఎస్‌డీసీ రుణం, బెవరేజస్‌ కార్పొరేషన్‌ రుణం కూడా ప్రభుత్వ అప్పులేనని కేంద్ర ఆర్థికశాఖ ఇప్పటికే చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే బహిరంగ మార్కెట్‌ ద్వారా సుమారు 40వేల కోట్లు తీసుకున్నారు.

ముఖ్యమంత్రి ద్రవ్యలోటు, జీడీపీలో రుణాల రేటు, అప్పులు మొత్తం పెరిగిన శాతాన్ని కూడా గతంతో, ఇతర రాష్ట్రాలతో పోల్చి చెప్పారు. అసలు అప్పుల లెక్కలే తప్పుగా చెబితే ఇక వాటి ఆధారంగా చేసే విశ్లేషణలు ఎలా సరైనవవుతాయన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కార్పొరేషన్ల అప్పులు ఏవీ మొత్తం అప్పుల్లో కలపలేదు. ఇక ఇతర రాష్ట్రాలతో పోల్చితే అందులోని వాస్తవాలు ఎలా తేలుతాయని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.


ఇవీ చదవండి:

Last Updated : Sep 17, 2022, 7:54 AM IST

ABOUT THE AUTHOR

...view details