ప్రేక్షకులకు భారం కాకుండా, సినీ పరిశ్రమకు మేలు చేసేలా టికెట్ల ధరలు సవరించామని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. ఇవి ఎవరికైనా మంచి రేట్లేనని, అందరికీ న్యాయం జరిగేలా ప్రయత్నించామని చెప్పారు. హీరో, హీరోయిన్, దర్శకుడి పారితోషికం మినహాయించి రూ.100 కోట్ల కంటే ఎక్కువ నిర్మాణ వ్యయంతో తీసే భారీ బడ్జెట్ సినిమాలను ప్రత్యేకంగా పరిగణిస్తామన్నారు. అలాంటి సినిమాల కోసం వారం రోజుల పాటు ప్రత్యేక ధరల్ని నోటిఫై చేస్తామని ప్రకటించారు. లేకపోతే భారీ సాంకేతికత, ఆవిష్కరణలతో పెద్ద ఎత్తున ఖర్చు చేయడానికి ఎవరూ ముందుకు రారని పేర్కొన్నారు.
సినీ పరిశ్రమ విశాఖపట్నం తరలిరావాలని, అక్కడ అందరికీ ఇళ్ల స్థలాలు, స్టూడియోల నిర్మాణానికి స్థలాలు ఇస్తామని ప్రకటించారు. అయిదో ఆట ప్రదర్శన వల్ల పరిశ్రమకు మేలు జరుగుతుందని చెప్పారు. మల్టీఫ్లెక్స్‌లకు కూడా మంచి ధరలు ఇస్తామని వివరించారు. సినిమా షూటింగ్‌లో కనీసం 20% మేర ఆంధ్రప్రదేశ్‌లో జరిగేలా నిబంధన తీసుకొస్తామని తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన తెలుగు సినీ ప్రముఖులతో భేటీ అయ్యారు. చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆర్.నారాయణమూర్తి, అలీ, పోసాని కృష్ణ మురళి, నిరంజన్‌రెడ్డి, మహి రాఘవ తదితరులతో సినీ పరిశ్రమ సమస్యలపైన ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు.
భారీ బడ్జెట్ సినిమాలకు వారంపాటు ప్రత్యేక ధరలు..
‘‘సినీ పరిశ్రమలో ఉన్న కొన్ని లోపాలను పూర్తిగా సరిదిద్దుకుని.. ఇండస్ట్రీ నిలబడేందుకు ఓ మంచి వ్యవస్థను క్రియేట్ చేసే ఉద్దేశంతో అడుగులు వేశాం. ఏ సినిమాకైనా, ఎవరి సినిమాకైనా ఒకే రేటు ఉండాలి. ప్రాథమికంగా ఒక ప్రాతిపదిక లేకుంటే ఎక్కువ, తక్కువ వసూళ్లు జరుగుతాయి. నేను, చిరంజీవి కలిసి కూర్చొని దీనిపై చాలాసేపు విస్తృతంగా చర్చించాం. అందరికీ న్యాయం జరిగేలా మంచి ధరలు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. హీరో, హీరోయిన్, దర్శకుడు పారితోషికం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండానే.. నిర్మాణ వ్యయం పరంగా కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఉన్నాయి. ఆ తరహా సినిమాలు చేయడంలో రాజమౌళి నిపుణుడు. అటువంటి సినిమాలను ప్రత్యేకంగా చూడాలి. అలా చూడకపోతే భారీ టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఖర్చుతో చేయడానికి ఎవరూ ముందుకురారు. అలాంటి సినిమాలకు వారం రోజుల పాటు కచ్చితంగా ప్రత్యేక ధరలు నోటిఫై చేసే విధంగా ట్రీట్ చేయాలని అనుకున్నాం."- సీఎం జగన్
సినీ పరిశ్రమలో లోపాలు
'అందరికీ ఒకటే రేట్లతో పాటు, ఆన్‌లైన్ పద్ధతిలో టికెట్ల విక్రయం ప్రభుత్వానికి, నిర్మాతలకూ మంచిది. ఏడాదికి రూ.వెయ్యికే, అంటే నెలకు సగటున రూ.80కే ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి. వాటితో పోటీపడాల్సిన పరిస్థితుల్లో టికెట్ రేట్ల విషయంలో సమతుల్యత అవసరం. ఇవే అంశాలపై చిరంజీవితో సుదీర్ఘంగా చర్చించాను. కనీస ఆదాయాలు రాకపోతే సినిమాలు తీయటం తగ్గిపోతుంది. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రీజనబుల్ రేట్ల దిశగా వెళ్లాం. అయిదో షో వేసుకుంటామని మీరు అడిగారు. అది అన్ని సినిమాలకూ వర్తిస్తుంది. చిన్న సినిమాలకు మంచి ఆదాయాలు వస్తాయి. తద్వారా పరిశ్రమకు మేలు కలుగుతుంది. మీరు చెప్పిన అన్ని విషయాలూ మనసులో పెట్టుకున్నా. పెద్ద, చిన్న సినిమాలకు న్యాయం జరిగేలా మంచి విధానం తీసుకురావాలనే కమిటీ ఏర్పాటు చేయటంతో పాటు, మీ అందరితోనూ సమావేశమయ్యా. సినీ పరిశ్రమలో ఉన్న లోపాలు సరిదిద్ది పరిశ్రమను నిలబెట్టేందుకు, మంచి వ్యవస్థను సృష్టించడానికి అడుగులు వేస్తున్నాం.
విశాఖపట్నం తరలి రావాలి
సినీ పరిశ్రమ విశాఖపట్నం తరలి రావాలి. అందరికీ ఇళ్లస్థలాలు, స్టూడియోల నిర్మాణానికి ఆసక్తి చూపిస్తే స్థలాలు ఇస్తాం. అక్కడ జూబ్లీహిల్స్ తరహా ప్రాంతాన్ని సృష్టిద్దాం. తెలంగాణతో పోలిస్తే సినీ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువ ఆదాయం వస్తోంది. ఏపీలోనే జనాభా, ప్రేక్షకులు, థియేటర్లు ఎక్కువ. విశాఖపట్నంలో మంచి వాతావరణం ఉంది. మనం అందరం అక్కడికి వెళ్తే ఇప్పటికిప్పుడు కాకపోయినా పదేళ్లకో, పదిహేనేళ్లకో మహానగరాలతో పోటీపడుతుంది. భారీ బడ్జెట్ సినిమాలు తీయడంలో రాజమౌళి నిపుణుడు. ఆయన మరిన్ని మంచి సినిమాలు, పెద్ద సినిమాలు తీయాలి. అదే సమయంలో చిన్న సినిమాలనూ రక్షించుకోవాలి. పండగ రోజుల్లో వారికి అవకాశాలు కల్పించేలా సమతుల్యత పాటించాలి' అని జగన్ కోరారు.
ఇదీ చదవండి: