జగన్ అక్రమాస్తుల కేసుల్లో నిందితులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ల వివరాలన్నీ.. మూడు వారాల్లో సమర్పించాలని సీబీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సీబీఐ, ఈడీ కోర్టులో జగన్(CM Jagan) అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. కేసుల వారీగా నిందితుల పిటిషన్ల జాబితా ఇవ్వాలని సీబీఐకి స్పష్టం చేసింది. కేసుల నుంచి తొలగించాలని కోరుతూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను.. కేసు వారీగా విచారణ చేపట్టి తేలుస్తామని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. హెటిరో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఇందూ గృహ నిర్మాణ ప్రాజెక్టుల కేసులో నిందితుడు జితేంద్ర వీర్వాణి, లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసు నిందితుడు ఎస్.బాలాజీ, పలు కంపెనీలు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై జస్టిస్ షమీమ్ అక్తర్ విచారణ చేపట్టారు.
జగన్ అక్రమాస్తుల కేసులో ఇండియా సిమెంట్స్ ఎండీ ఎన్.శ్రీనివాసన్ ను నిందితుల జాబితా నుంచి హైకోర్టు తొలగించిందని.. మిగతా నిందితులకూ వర్తింపచేయాలని హెటిరో తరఫు న్యాయవాది వాదించారు. సీఎం కుమారుడి కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం తప్పేమీ కాదని.. ఈ కేసులపై రాజకీయ ప్రభావం ఉందన్నారు. జగన్ అక్రమాస్తుల కేసులకు.. రాజకీయాలకు సంబంధం లేదని సీబీఐ స్పష్టం చేసింది. వేర్వేరుగా 11 కేసులు ఉన్నాయని.. శ్రీనివాసన్ పిటిషన్ పై తీర్పు అందరికీ వర్తించదని సీబీఐ తరఫు న్యాయవాది సురేందర్ వాదించారు. జగన్ కేసుల్లో 103 మంది నిందితులని.. అందులో పలువురు క్వాష్ పిటిషన్లు వేశారన్నారు. పిటిషన్ల వివరాలన్నీ సమర్పించాలని సీబీఐని ఆదేశిస్తూ.. ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.