ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

90 శాతం హామీల అమలు దిశగా అడుగులు: సీఎం - రైతు భరోసా సెంటర్లు

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను.. ఏడాది పాలనలోనే 90 శాతం అమలుచేసే దిశగా అడుగులు వేశామని సీఎం జగన్ చెప్పారు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేలా చూస్తున్నామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తున్నామని వెల్లడించారు.

cm jagan
cm jagan

By

Published : May 30, 2020, 12:29 PM IST

ఏడాది వైకాపా పాలన నిబద్ధతతో సాగిందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రైతు భరోసా కేంద్రాల ప్రారంభాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పాదయాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశానని చెప్పారు. గిట్టుబాటు ధరలు లేక పంటలు పొలాల్లోనే విడిచిపెట్టిన పరిస్థితి చూశానన్న ఆయన... వారి జీవితాలను మార్చాలన్న ఆలోచనలు తనలో వచ్చాయని గుర్తు చేశారు. ఇవన్నీ చూసి కేవలం 2 పేజీల మేనిఫెస్టో విడుదల చేశామన్నారు. నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్తే జీవితాలు బాగుపడుతాయని విశ్వసించానన్నారు.

90శాతం అమలు దిశగా...

మేనిఫెస్టోలో చెప్పిన హామీలను 90 శాతం అమలు చేసే దిశగా అడుగులు వేశామని సీఎం జగన్ చెప్పారు. ఇచ్చిన హామీలు 129 కాగా... అమలు చేసినవి 77 ఉన్నాయని చెప్పారు. అమలు కోసం మరో 36 హామీలు సిద్ధంగా ఉన్నాయన్న జగన్... ఇంకా అమలు కావాల్సినవి 16 ఉన్నాయని వెల్లడించారు.

అవినీతికి తావు లేదు...

'అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. అవినీతికి తావు లేకుండా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నాం. పింఛన్లకు రూ.1500 కోట్లు ఖర్చు అవుతోంది. గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచినవన్నీ పూర్తి చేస్తూ వస్తున్నాం. వెనుకబడిన వర్గాలకు రూ.19,309 కోట్లు, గిరిజనుల సంక్షేమానికి రూ.2136 కోట్లు ఖర్చు చేశాం'- జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి

మంచి పనులను అడ్డుకుంటున్నారు

గత ప్రభుత్వం 650 పైచిలుకు వాగ్దానాలు చేసి పది శాతం కూడా అమలు చేయలేదని ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు తమ గుప్పిట్లోనే పెట్టుకునే ప్రయత్నం చేశారన్నారు. పేదలకు ఇళ్లు ఇస్తామంటే కోర్టుకు వెళ్లి అడ్డుకునే ప్రతిపక్షాన్ని ఇక్కడే చూస్తున్నామని సీఎం వ్యాఖ్యానించారు.

పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం అమలు చేద్దామన్నా అడ్డుకుంటున్నారని అన్నారు. తమ పాలనలో అవినీతికి తావులేకుండా లబ్దిదారుల ఖాతాలకే నిధులు జమ చేస్తున్నామన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా 540 సేవలు గడువు పెట్టిమరీ అందిస్తున్నామని సీఎం వివరించారు.

వైకాపా పాలనలో ఎవరి ప్రమేయం, సిఫార్సు లేకుండా నేరుగా అర్హులకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని సీఎం జగన్ స్పష్టం చేశారు. పైసా లంచం ఇవ్వకుండా, వివక్షకు తావులేకుండా చేస్తున్నామన్న ఆయన... పింఛన్‌, రేషన్‌ కార్డు వంటి ఏ పనులైనా సులభంగా జరిగేలా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో నకిలీ విత్తనాలను పంపిణీ చేసేవారని చెప్పారు. కానీ.. వైకాపా పాలనలో అలాంటి వాటికి అవకాశం లేకుండా పంపిణీ జరుగుతోందన్నారు.

జూలై 1న ప్రారంభం

ఆరోగ్యశ్రీలోకి మరిన్ని వైద్య సేవలు జోడించాం. పశ్చిమగోదావరి జిల్లా నుంచి పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభించాం. ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2 వేల జబ్బులు తీసుకొచ్చాం. జులై 1న 108, 104 వాహనాలు బెంజ్ సర్కిల్ నుంచి ప్రారంభిస్తాం. అన్ని జిల్లాలకు 108, 104 వాహనాలు వెళ్తాయి.‌ 1060 అంబులెన్స్‌ వాహనాలు ఒకేసారి ప్రారంభమవుతాయి.- సీఎం జగన్

-

ఇదీ చదవండి:

'కమిషనర్​​ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు'

ABOUT THE AUTHOR

...view details