'రాజకీయ వ్యవస్థలో మార్పు అంటే ఏంటో వైకాపా ప్రభుత్వం చూపించింది. అక్కాచెల్లెమ్మల సాధికారత అంటే ఇలా ఉంటుందని చూపించాం. రైతులపై మమకారముంటే ఇలా ఉంటుందని పరిపాలనలో చూపించాం. అన్ని రంగాలపైనా మనదైన ముద్ర వేయగలిగాం' అని వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆ పార్టీ శ్రేణులనుద్దేశించి అన్నారు. వైకాపా రెండు రోజుల ప్లీనరీ గుంటూరు జిల్లాలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో శుక్రవారం ప్రారంభమైంది. తొలిరోజు సదస్సులో జగన్ ప్రారంభోపన్యాసం చేశారు. జగన్ తల్లి వైఎస్ విజయమ్మ కూడా మాట్లాడారు.
"నాకు వెన్నుదన్నుగా.. నాతో నిలబడిన ప్రతి ఒక్కరికీ ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా.. మీ వాడిగా, మీ ఆప్తుడిగా, మీ కుటుంబసభ్యుడిగా సెల్యూట్ చేస్తున్నా."
-సీఎం జగన్
పటిష్ఠ భద్రతా ఏర్పాట్ల మధ్య మొదలైన ఈ ప్లీనరీకి భారీసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. తొలిరోజు నాలుగు తీర్మానాలను ప్రవేశపెట్టారు. ప్రారంభోపన్యాసంలో సీఎం జగన్ మాట్లాడుతూ, ‘గ్రామపరిపాలన వ్యవస్థను ప్రజలకు చేరువగా, పారదర్శకంగా.. అవినీతి, వివక్ష లేకుండా ఎలా చేయగలమో, ఎలా మార్చామో వైకాపా ప్రభుత్వం చూపించింది. పరిపాలన సంస్కరణలంటే ఇలా ఉంటాయని చేసి చూపించింది. అవ్వాతాతల మీద మమకారం ఇలా ఉంటుందని చేసి చూపించింది. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యావిధానం ఇలా ఉంటుందని చేసి చూపించింది. వైద్య, ఆరోగ్య రంగం మీద ప్రేమ ఉంటే పరిపాలనలో ఇలాంటి మార్పులు చేస్తుందని చూపించింది. ప్రతీ పేదోడి సొంతింటి కలనూ నిజం చేయడం ఎలాగో చేసి చూపించింది. మూడేళ్లలో రెండు సంవత్సరాలు కరోనా సవాళ్లు విసిరినా, చంద్రబాబు రాష్ట్రాన్ని ముంచేసి పోయినా, వాళ్ల బకాయిలను మనమే కట్టాల్సి వచ్చినా, నవరత్నాల పాలన అందిస్తామని చెప్పాం, ఆ మాటను తు.చ. తప్పక అమలు చేశామని చెబుతున్నాను. ఇంతటి మార్పు గతంలో ఎప్పుడైనా చూశామా? అయినా గిట్టనివారు అసూయతో విమర్శిస్తున్నారు. మంచి చేసిన చరిత్ర, మాటకు విలువ ఇచ్చిన ·నైతికత ప్రతిపక్షానికి ఉన్నాయా’ అని సవాలు చేశారు.