' కలిసొచ్చే ఎమ్మెల్సీలు వస్తే.. మండలిపై పునరాలోచిద్దాం' శాసన మండలి రద్దు అంశంపై వైకాపా సమాలోచనలు చేస్తోంది. ఇతర పార్టీల ఎమ్మెల్సీలు కలిసివస్తే మండలి రద్దుపై పునరాలోచించవచ్చన్న అభిప్రాయాన్ని కొందరు వైకాపా ముఖ్యనేతలు పార్టీ అధినాయకత్వం వద్ద వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి మద్దతుగా నిలిచే ఎమ్మెల్సీలను ఒక ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేస్తే.. మండలిని యథావిధిగా కొనసాగించే వీలుంటుందని కొందరు అంటున్నారు. 2021 జూన్ నాటికి మండలిలో అధికార పక్షానికి సంఖ్యా బలం పెరిగే అవకాశం ఉందన్న విషయాన్నీ వారు గుర్తుచేస్తున్నారు. కానీ అప్పటి వరకూ ‘రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మండలిలో ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి కదా?’ అని ముఖ్యమంత్రి తన అభిప్రాయాన్ని గట్టిగానే చెబుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
తొందరపాటు వద్దు
పార్టీ ముఖ్యనేతలు ముఖ్యమంత్రితో శుక్రవారం సమావేశమై శాసనమండలి విషయంపై చర్చించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్ కూడా జగన్‌ను కలిశారు. ‘తొందరపాటుతో కాకుండా, ప్రత్యామ్నాయాలను పరిశీలనలోకి తీసుకుని ముందుకెళితే బాగుంటుంది’ అని ముఖ్యనేతలు, కొందరు మంత్రులు సీఎంతో అన్నట్లు సమాచారం. అంతకుముందు ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు కూడా జగన్‌ను కలిసి మండలి అంశంపై చర్చించారు.
గన్నవరంలో సమన్వయ బాధ్యత మంత్రులకు
మంత్రులు కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శుక్రవారం ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఎమ్మెల్యే వంశీ, గన్నవరం నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావ్ మధ్య సమన్వయం తీసుకురావడం, అక్కడ స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపు బాధ్యతలను ఆ ముగ్గురు మంత్రులకు సీఎం అప్పగించినట్లు తెలిసింది.
ఇదీ చదవండి:అమరావతి మున్సిపల్ కార్పొరేషన్‌కు సన్నాహాలు!