రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుంచి ప్రారంభించనున్న వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి జగన్ దిల్లీ చేరుకున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలు తదితర అంశాలను ప్రధాని మోదీకి మరోమారు సీఎం నివేదించనున్నారు. ప్రత్యేకించి పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా సాధించిన విజయాలను కూడా ప్రధానికి వివరించనున్నట్టు సమాచారం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా కేంద్రం నుంచి ఎప్పటికప్పడు నిధుల విడుదలకు సంబంధించి ఎలాంటి ఆటంకం లేకుండా చూడాల్సిందిగా నివేదించే అవకాశముంది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉండటంతో ప్రత్యేకంగా నిధుల విడుదలకు ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా సీఎం కోరనున్నారు. ఏపీకి రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయటంతోపాటు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల ఏర్పాటుపై ప్రధానికి ముఖ్యమంత్రి జగన్ నివేదించనున్నట్టు తెలుస్తోంది. పీపీఏల సమీక్షకు సంబంధించి కేంద్రం నుంచి వస్తున్న లేఖలకు రాష్ట్ర ప్రభుత్వ స్పందననూ వివరించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రధానికి వివరిస్తారని సమాచారం.
దిల్లీ చేరుకున్న సీఎం... సాయంత్రం ప్రధానితో భేటీ
రాష్ట్రానికి చెందిన వివిధ అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి జగన్ దిల్లీ చేరుకున్నారు. ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈ నెల 15న ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించనున్నారు.
cm_delhi tour_meet wiht pm modi
Last Updated : Oct 5, 2019, 1:41 PM IST