సన్ సెట్ ఏపీ అంటూ కర్నూలు భాజపా ప్రచార సభలోప్రధానిమోదీ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఏమీ చేయని మోదీ... నిందలు మోపుదామనుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. తెదేపా నేతలతో టెలీ కాన్ఫరెన్స్ చేసిన అధినేత..మోదీ మాట్లాడిన తీరును తప్పుబట్టారు.కష్టపడి అభివృద్ధి చేసుకుంటున్న రాష్ట్రంపై ఇంత అక్కసా అని ఆక్షేపించారు. మోదీ సభకు వైకాపా కార్యకర్తలను తరలించిందని ఆరోపించారు.
ధైర్యముంటే శ్వేతపత్రం విడుదల చేయండి
రాష్ట్రానికి ఇప్పటివరకూ ప్రధాని మోదీ ఏమీ చేయలేదని చంద్రబాబు అన్నారు.అభివృద్ధికి సాయం చేయకపోగా.. కక్ష గట్టారని ఆరోపించారు. ధైర్యముంటే రాష్ట్రానికి చేసిన సహాయంపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే.. కేంద్రం సాయంపై తామే శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని హెచ్చరించారు.