రాష్ట్రంలో మానవహక్కుల సంఘం ఛైర్మన్, సభ్యుల నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం.. హైకోర్టు ముందు ఉంచింది. మానవహక్కుల సంఘం ఛైర్మన్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీతారామమూర్తి, జ్యుడీషియల్ సభ్యులుగా రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి దండే సుబ్రహ్మణ్యం, నాన్ జ్యుడీషియల్ సభ్యులుగా న్యాయవాది గోచిపాత శ్రీనివాసరావులను నియమించినట్లు అడ్వకేట్ జనరల్ న్యాయస్థానం ముందుంచారు.
హెచ్ఆర్సీ ఏర్పాటుపై కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై విచారణ మూసివేత - ఏపీ హెచ్ఆర్సీపై హైకోర్టులో వాజ్యం
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీతారామమూర్తి, జ్యుడీషియల్ సభ్యులుగా విశ్రాంత జిల్లా న్యాయమూర్తి దండే సుబ్రమణ్యం, నాన్ జ్యూడీషియల్ సభ్యులుగా న్యాయవాది గోచిపాత శ్రీనివాసరావులను నియమించినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. వీరి నియామకాలకు సంబంధించి ఆ జీవోలను అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ న్యాయస్థానం ముందు ఉంచారు.
ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం వ్యాజ్యంపై విచారణను మూసివేసింది. మావన హక్కుల కమిషన్ ఏర్పాటు కోసం ఏపీ పౌరహక్కుల అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి బి.మోహనరావు గతంలో హైకోర్టులో పిల్ వేశారు. కోర్టు ఆదేశాల మేరకు కమిషన్ ఏర్పాటు చేయలేదని ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాజ్యం విచారణకు రాగా.. కమిషన్ ఛైర్మన్, సభ్యులను నియమించామని ఏజీ తెలిపారు. పిటిషనర్ తరపు న్యాయవాది పొత్తూరి సురేశ్ కుమార్ స్పందిస్తూ.. మానవ హక్కుల కమిషన్ సీటు ఎక్కడ ఏర్పాటు చేస్తారో స్పష్టత ఇవ్వలేదన్నారు. ఏజీ బదులిస్తూ.. ఏపీ విభజన చట్టంలోని పదో షెడ్యూల్‌తో ఈ వ్యవహారం ముడిపడి ఉందని బదులిచ్చారు.
ఇదీ చదవండి: 'కుటుంబ పింఛను'లో కుమార్తెలకూ వాటా