తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పథకం సామాజిక భద్రతా పింఛన్లు అందుతున్నాయి. వృద్ధాప్య, దివ్యాంగులు, వితంతువులకు పింఛన్లతో పాటు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులకు భృతి, బోధకాల వ్యాధిగ్రస్తులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఆర్థికసాయం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆసరా పింఛన్ల సంఖ్య 37 లక్షలా 86 వేల 20. ఇందులో వృద్ధాప్య పింఛన్లు 11 లక్షలా 76 వేల 743 కాగా... దివ్యాంగుల పింఛన్లు పొందుతున్న వారు నాలుగు లక్షల 81 వేల 210 మంది ఉన్నారు.
65 ఏళ్లు ఆ పైబడిన వారికి ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్లు అందుతున్నాయి. వృద్ధాప్య పింఛన్ అర్హతా వయస్సును 57 ఏళ్లకు తగ్గిస్తామని 2018 శాసనసభ ఎన్నికల సమయంలో తెరాస మేనిఫెస్టోలో పేర్కొంది. తెరాస సర్కార్ రెండో మారు అధికారంలోకి రాగానే ఫించను వయస్సు కుదింపునకు సంబంధించి కసరత్తు జరిగింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కసరత్తు చేసింది. ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకొని అవసరమైన కసరత్తు చేసి 57ఏళ్ల వయస్సు, ఆ పైబడిన వారిని గుర్తించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా మిగతా జిల్లాల్లో ఈ తరహాలో ఆరున్నర లక్షల మంది అదనపు లబ్ధిదారులు ఉన్నట్లు తేలింది. జీహెచ్ఎంసీ పరిధిలోని వివరాలు కలిస్తే లబ్దిదారుల సంఖ్య ఇంకా పెరగనుంది.