CJI NV Ramana visits Ponnavaram village: పుట్టిన ఊరు, కన్నతల్లి, మాతృభాషను ఎప్పటికీ మరిచిపోలేమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తన స్వగ్రామమైన పొన్నవరంలో జస్టిస్ ఎన్వీ రమణకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన్ను గ్రామ పెద్దలు ఘనంగా సన్మానించారు. సీజేఐకి శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు ఇచ్చారు. గజమాలతో సత్కరించారు. వివిధ రకాల బహుమతులనూ గ్రామస్థులు అందించారు. అనంతరం సీజేఐకి వెండి నాగలి బహూకరించారు.
CJI NV Ramana visits his native village: ఈ సమావేశంలో మాట్లాడిన జస్టిస్ ఎన్వీ రమణ.. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పొన్నవరం గ్రామంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. తన ఉన్నతికి కుటుంబసభ్యుల సహకారం ఎంతో ఉందన్న సీజేఐ.. చిన్నప్పుడు ఉపాధ్యాయులు తనను ఎంతో ప్రేమగా చూసేవారని చెప్పారు. పొన్నవరం, కంచికచర్లలో ప్రాథమిక విద్యాభ్యాసం జరిగిందని చెప్పారు. 1967లోనే రాజకీయ చైతన్యం ఉన్న గ్రామం.. తమ పొన్నవరమన్న జస్టిస్ ఎన్వీ రమణ.. పొన్నవరం రోడ్లు, పొలాలు, చెరువులు ఇంకా గుర్తున్నాయని తెలిపారు. పొన్నవరం ప్రజల ఆశీర్వాదం కోసమే వచ్చానని అన్నారు.
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసి.. దీనికి తెలుగును జోడిస్తా. పొన్నవరం ప్రజల ఆశీర్వాదం కోసమే వచ్చా. ఎంత ఎదిగినా నా మాతృభూమిని మరిచిపోలేదు. మనదేశం అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తోంది. సమస్యలు అధిగమించాలంటే అందరూ కలిసి పనిచేయాలి. తెలుగుజాతి గొప్పతనం పదిమందికీ తెలిసేలా మనం ప్రవర్తించాలి. భారత్ బయోటెక్ అధిపతి తెలుగువారైనందుకు గర్వపడాలి. తెలుగువాళ్లు కరోనా టీకా కనుక్కోవడం మనకు గర్వకారణం. తెలుగువారికి సరైన గుర్తింపు దక్కలేదని నాకు ఆవేదన ఉంది - జస్టిస్ ఎన్వీ రమణ, భారత ప్రధాన న్యాయమూర్తి
అన్ని సమస్యల పరిష్కారానికి ప్రజల ఐకమత్యమే మందు అన్నారు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ. తెలుగువారి గొప్పదనం మరింత పెంచేలా మనం ప్రవర్తించాలని సూచించారు. తెలుగువారి గొప్పదనం గురించి దిల్లీలో అనేకమంది చెబుతారని చెప్పారు. అందరి అభిమానం, ఆశీస్సులతోనే ఈ స్థానంలో ఉన్నానని తెలిపారు. తెలుగుజాతి ఔన్నత్యం, గౌరవం మరింత పెంచాలని విజ్ఞప్తి చేశారు. మాతృభూమి మట్టివాసన సుగంధాన్ని ఆస్వాదిస్తున్నానని వ్యాఖ్యానించారు.
"రైతు కుటుంబం నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగారు"
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రసంగిస్తూ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అత్యున్నత పదవిని అలంకరించడం అరుదైన విషయమని కొనియాడారు. దేశానికి వన్నె తెచ్చే విధంగా పనిచేస్తారని ఆశిస్తున్నామన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సీజేలు జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణప్రసాద్, జస్టిస్ ప్రవీణ్‌కుమార్, జస్టిస్ సత్యనారాయణమూర్తి, జస్టిస్ లలిత, జస్టిస్ జయసూర్య, జస్టిస్ కృష్ణమోహన్, జస్టిస్ దేవానంద్, మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్, గ్రామ సర్పంచి రాజశ్రీ హాజరయ్యారు. గ్రామస్థులు, అధికారులు, పలువురు ప్రముఖులు జస్టిస్ ఎన్.వి.రమణను ఘనంగా సన్మానించారు.