CJI NV Ramana Warangal Tour: తెలంగాణలో అద్భుత శిల్పసంపదకు నిలయమైన కాకతీయ కట్టడం, యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సందర్శిస్తారు. ఆలయంలోని రుద్రేశ్వర స్వామిని సీజేఐ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. రామప్పకు వస్తున్న జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు ఘనస్వాగతం పలికేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని మరింత సుందరంగా ముస్తాబుచేశారు. పడమర వైపు గేటు నుంచి ఆలయం వరకు విద్యుత్ కాంతులతో అలంకరించారు. రామప్ప ఆలయ సందర్శన అనంతరం సీజేఐ హనుమకొండకు వెళ్లి రాత్రి నిట్ కళాశాలలో బస చేస్తారు.
కోర్టు భవనాల ప్రారంభం..
Opening of court buildings: రేపు ఉదయం వరంగల్ వాసుల ఇలవేల్పు భద్రకాళీ అమ్మవారిని సీజేఐ దంపతులు దర్శించుకుంటారు. అనంతరం హనుమకొండలో కొత్తగా నిర్మించిన పదికోర్టుల భవన సముదాయాన్ని జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభిస్తారు. ఎనిమిదిన్నర దశాబ్దాలుగా ప్రజలకు సేవలందిస్తున్న ఓరుగల్లు న్యాయస్థానాన్ని రూ.22 కోట్లతో ఆధునీకరించారు. ప్రవేశ ద్వారం ఆకట్టుకునేలా కాకతీయుల స్వాగత తోరణాన్ని ఏర్పాటుచేశారు.