CJI visit to amaravathi: సీజేఐ హోదాలో తొలిసారి అమరావతికి జస్టిస్ ఎన్.వి.రమణ విచ్చేశారు. ఆయనకు అమరావతి రైతులు, ఐకాస నేతలు ఘన స్వాగతం పలికారు. రాయపూడి వద్ద కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. ఆకుపచ్చ కండువాలు, జాతీయ జెండాలతో సీజేఐని ఆహ్వానించారు.
ఆదివారం హైకోర్టు ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి విచ్చేసిన సీజేఐకి స్వాగతం పలికేందుకు రాజధానిలోని వివిధ గ్రామాల నుంచి ఉదయం 10 గంటలకే రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున రాయపూడి, నేలపాడు తదితర ప్రాంతాలకు చేరుకున్నారు. మధ్యాహ్నం 2.45 గంటల జస్టిస్ ఎన్.వి.రమణ వచ్చేవరకు వేచి ఉండి, రాయపూడి కూడలి నుంచి నేలపాడులోని హైకోర్టు ప్రాంగణం వరకూ దాదాపు మూడు కిలోమీటర్ల మేర రహదారికి ఒకవైపున మానవహారంగా నిలుచుని స్వాగతం పలికారు. సీజేఐ ప్రయాణించే దారి మొత్తం పూల జల్లు కురిపించారు. కొందరు మహిళలు దూరం నుంచే ఆయనకు హారతులిచ్చి అభిమానాన్ని చాటుకున్నారు. ‘తెలుగు జాతి ముద్దుబిడ్డకు స్వాగతం’, ‘రైతు పుత్రుడా.. ధర్మ రక్షకుడా! హక్కులకు దిక్కులేని చోట మీరే న్యాయానికి దిక్సూచి’, ‘తెలుగు తేజమా మీకు వందనం.. తెలుగుజాతి ముద్దు బిడ్డను చూసి మురిసింది ఈ గడ్డ’, ‘రైతు బిడ్డ కష్టం సామాన్యుడికి దక్కుతున్న న్యాయం’ వంటి నినాదాలు, జస్టిస్ ఎన్.వి.రమణ చిత్రాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ స్వాగతం పలికారు. వెలగపూడికి చెందిన ఒక రైతు.. తన కుటుంబంలోని నాలుగు తరాలవారు పండించిన చెరకు, అరటి, రేగు, జామ, కొబ్బరి పంటలను చేతబూని జస్టిస్ ఎన్.వి.రమణకు స్వాగతం పలికారు. ‘తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటి చెప్పి. భారతదేశపు న్యాయవ్యవస్థ అత్యున్నత శిఖరాన్ని అధిరోహించిన తెలుగుజాతి ఆణిముత్యం జస్టిస్ నూతలపాటి వెంకటరమణకు వందనం.. అభివందనం’ అంటూ రాజధాని అమరావతి ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.