CJI N.V. RAMANA in Hanamkonda: కోర్టుల ఆధునీకరణతో ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. కోర్టుల్లో సౌకర్యాల కోసం అన్ని రాష్ట్రాల నుంచి సమాచారం తెప్పించామని.. కోర్టుల పునర్నిర్మాణానికి జస్టిస్ నవీన్‌రావు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని సీజేఐ అన్నారు. తన ఆలోచనలకు అనుగుణంగా కోర్టుల ఆధునీకరణ జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలోని హనుమకొండలో కోర్టుల భవన సముదాయాన్ని జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టీఎస్ హైకోర్టు సీజే జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ నవీన్ రావు హాజరయ్యారు. కాకతీయుల చారిత్రక సంపదకు దీటుగా కోర్టు భవనాల నిర్మాణం జరిగిందని సీజేఐ కొనియాడారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో కోర్టుల అభివృద్ధి జరగడం లేదని జస్టిస్ రమణ అన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం.. న్యాయవ్యవస్థకు సంపూర్ణ మద్దతునిస్తుందని కొనియాడారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కోర్టుల ఆధునీకరణ చేపట్టిందని చెప్పారు.
'శిథిలావస్థలోని కోర్టులను పునర్నిర్మించాలని సీజేఐ అయ్యాక అనుకున్నాను. ఆధునీకరణ ద్వారానే సత్వర న్యాయం అందించగల్గుతామని చెప్పాను. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర హైకోర్టుల నుంచి సమాచారం సేకరించాను. కోర్టుల్లో మౌలిక సౌకర్యాల ప్రత్యేక సంస్థ ఏర్పాటుపై జులైలో ప్రతిపాదన పంపాం. అదే విధంగా ఇండియన్ జ్యుడీషియరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుపై ప్రతిపాదన పంపాం. ఇప్పటివరకూ న్యాయమంత్రిత్వశాఖ, కేంద్రం నుంచి సమాధానం రాలేదు. ప్రత్యేక సంస్థపై పార్లమెంటు సమావేశాల్లో చట్ట రూపంలో తెస్తారని ఆశిస్తున్నాను.' -జస్టిస్ ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు సీజే