ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CJI Justice NV Ramana: 'దిశ' కేసులో విచారణను ఎందుకు సాగదీస్తున్నారు? - CJI Justice NV Ramana verdict

సుప్రీంకోర్టులో దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసు విచారణ జరిగింది. విచారణ కమిటీ నివేదిక దాఖలుకు సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను కోరింది. మరో ఆరు నెలల సమయం కావాలని విజ్ఞప్తి చేసింది. పదేపదే సమయమెందుకు కోరుతున్నారని సీజేఐ ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పటికే 170 మందిని ప్రశ్నించారని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. ఇంకా ఎంతమందిని ప్రశ్నించాలని అడిగారు.

cji
cji

By

Published : Aug 4, 2021, 9:02 AM IST

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ విచారణను ఎందుకు సాగదీస్తున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రశ్నించారు. జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ విచారణ గడువు పొడిగింపు పిటిషన్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుటకు మంగళవారం వచ్చింది. గడువును మరో ఆరు నెలల పాటు పొడిగించాలని ధర్మాసనానికి కమిషన్‌ తరఫు న్యాయవాది కె.పరమేశ్వర్‌ విజ్ఞప్తి చేశారు. సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ జోక్యం చేసుకుంటూ.. ‘‘విచారణను మూడు, నాలుగు నెలల్లో పూర్తి చేయొచ్చు. ఈ విషయంలో 130 నుంచి 140 మందిని విచారించాల్సిన అవసరం ఉందా?’’ అని ప్రశ్నించారు.

కొవిడ్‌ మహమ్మారి ప్రభావంతో కమిషన్‌ విచారణ పూర్తి చేయలేకపోయిందని న్యాయవాది తెలిపారు. ‘‘ఉత్తర్‌ప్రదేశ్‌ ఘటనపై విచారణ పూర్తయింది. ఆ కమిషన్‌ (యూపీ గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబే ఎన్‌కౌంటర్‌పై నియమించిన జస్టిస్‌ చౌహాన్‌ కమిషన్‌) నివేదిక కూడా సమర్పించింది’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. గడువు పొడిగింపు కోరడం ఇది మూడోసారని, ఇదే ఆఖరి అవకాశం అయ్యేలా చూడాలని పిటిషనర్లుగా ఉన్న న్యాయవాదులు జి.ఎస్‌.మణి, ప్రదీప్‌కుమార్‌ యాదవ్‌ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న సీజేఐ.. కమిషన్‌ తన తుది నివేదిక సమర్పించేందుకు గడువును నేటి నుంచి ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు తెలిపారు.

కేసు నేపథ్యం ఇదీ..

దిశ అనే యువతి 2019 నవంబరు ఆఖరులో హైదరాబాద్‌ శివార్లలో అత్యాచారం, హత్యకు గురైంది. నాలుగు రోజుల్లోనే నిందితులను పోలీసులు పట్టుకున్నారు. డిసెంబరు 6న ఘటన పునఃసృష్టి (రీకన్‌స్ట్రక్షన్‌)కి ప్రయత్నిస్తుండగా నిందితులు తమ తుపాకులు లాక్కోవడంతో కాల్పులు జరిపామని.. ఎన్‌కౌంటర్‌లో నలుగురు నిందితులు చనిపోయారని పోలీసులు ప్రకటించారు. నిందితుల ఎన్‌కౌంటర్‌పై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. 2019 డిసెంబరు 12న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ వికాస్‌ శ్రీధర్‌ సిర్పుర్కర్‌ నేతృత్వంలో కమిషన్‌ ఏర్పాటు చేసింది. బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి రేఖ, సీబీఐ మాజీ డైరెక్టర్‌ కార్తికేయన్‌లను సభ్యులుగా నియమించింది. ఆరు నెలల్లో విచారణ ముగించాలని ఆదేశించింది. 2020 జులైలో కమిషన్‌ నివేదిక సమర్పించాల్సి ఉన్నా.. మరో ఆరు నెలలు గడువు కోరింది. అందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. 2021 జనవరిలో మరోసారి గడువు పొడిగింపు కోరింది. రెండోసారి ఇచ్చిన గడువు కూడా జులైతో ముగియడంతో ఇంకోసారి పొడిగింపు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ తాజాగా విచారణకు వచ్చింది. దీనిపై వాదనలు విన్న సుప్రీంకోర్టు కమిషన్‌ విచారణ గడువును మరో ఆరు నెలలు పొడిగించింది.

ఇదీ చూడండి:Vaccine: రాష్ట్రానికి చేరుకున్న మరో 2.04 లక్షల కొవిడ్ టీకా డోసులు

ABOUT THE AUTHOR

...view details