భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చొరవతో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ఒకేసారి 24 నుంచి 42కి పెరిగింది. పెండింగ్ కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని 2019 ఫిబ్రవరి 13న అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేంద్ర న్యాయశాఖకు ప్రతిపాదనలు పంపారు. పరిశీలన తర్వాత న్యాయశాఖ దాన్ని అప్పట్లో పెండింగ్‌లో పెట్టింది. ముఖ్యమంత్రి నుంచి లేఖ, ప్రధానమంత్రి కార్యాలయం చేసిన సూచనలను అనుసరించి మరోసారి పరిశీలించింది. సంఖ్య పెంచడం కంటే ముందు న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అదే ఏడాది నవంబరు 15న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది.
తెలంగాణ పరిస్థితిని ప్రత్యేకంగా ప్రస్తావించిన సీజేఐ..
జస్టిస్ ఎన్వీ రమణ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న వివిధ హైకోర్టుల ప్రతిపాదనలను సమీక్షించారు. ఆ విషయాలను ప్రధానమంత్రి, కేంద్ర న్యాయశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అందులో న్యాయమూర్తుల సంఖ్య పెంపుపై తెలంగాణ హైకోర్టు పంపిన ప్రతిపాదనల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. గతనెల 27న మరోసారి కేంద్ర న్యాయశాఖ మంత్రికి లేఖ రాశారు.
‘‘తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అంశం 2019 నుంచి పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం జడ్జిల పోస్టులను పూర్తిగా భర్తీ చేసినప్పటికీ అక్కడున్న పెండింగ్ కేసుల పరిష్కారానికి సరిపోరు. పెండింగ్ కేసుల సంఖ్య 2.46 లక్షలకు చేరింది. మొత్తం 2.10 లక్షల సివిల్, 36 వేల క్రిమినల్ కేసులు ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదన ప్రకారం అక్కడ 42 మంది న్యాయమూర్తులు కూర్చొనేందుకు అవసరమైన మౌలిక వసతులు సిద్ధంగా ఉన్నాయి. కొత్తగా ఖర్చు చేయాల్సిందేమీ లేదు. హైకోర్టు చేసిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి కూడా అంగీకరించారు’’ అని వివరించారు.