ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భూమిని కాజేసేందుకు పక్కా ప్లాన్.. సినీఫక్కీలో కుట్ర! - సంగారెడ్డి జిల్లాలో భూమి కబ్జా ప్లాన్​

పొలంలో దేవుని విగ్రహం దొరుకుతుంది. ఊరి వాళ్లంతా వచ్చి పూజలు మొదలుపెడతారు. అక్కడే గుడి కట్టాలనే డిమాండ్ మొదలవుతుంది. తమకు నచ్చని వారి మీద పగ తీర్చుకునేందుకు సినిమాల్లో.. ఇలాంటి సీన్లు ఎన్నో చూశాం. సరిగ్గా ఇలాంటి వ్యవహారమే తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది.

భూమిని కాజేసేందుకు పక్కా ప్లాన్
భూమిని కాజేసేందుకు పక్కా ప్లాన్

By

Published : Apr 4, 2022, 10:04 PM IST

భూమిని కాజేసేందుకు పక్కా ప్లాన్

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుసారెడ్డిపల్లిలో సినిమాను మించిన డ్రామా నడుస్తోంది. తమకు నచ్చని వ్యక్తిని ఇబ్బంది పెట్టేలా కొందరు దేవుడి విగ్రహం పేరిట సరికొత్త కథను వాడుకుంటున్నారు. ఏసంతి అనే రైతుకు నలబై ఏళ్ల క్రితం దాదాపు రెండున్నర ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటికీ ఆ భూమి ఆయన పేరిటే ఉంది. కొత్త పాసు పుస్తకమూ ఇచ్చారు. ఈ భూమి మీద ఆయన రుణమూ తీసుకున్నారు. రోడ్డు పక్కనే ఉన్న ఈ భూమిని ఆయనకు కాకుండా చేయాలని.. ఇదే గ్రామానికి చెందిన కొందరు యత్నించారు.

సినిమాను తలదన్నే డ్రామా:గుడి కడతాం.. భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు ఏసంతి ఒప్పుకోలేదు. దౌర్జన్యంగా లాక్కునే ప్రయత్నం చేశారు. అధికారులకు అదే విషయమై ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకపోయింది. దీంతో రైతు ఏసంతి గతేడాది న్యాయస్థానాన్ని ఆశ్రయించగా... ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో వారు పంథా మార్చారు. సినిమాను తలదన్నే డ్రామాకు తెరతీశారు.

పురాతన విగ్రహమని ప్రచారం:ఇటీవల దేవుని విగ్రహాన్ని చెక్కించారు. దానిని గుట్టుచప్పుడు కాకుండా రైతు ఏసంతి భూమిలో పాతిపెట్టారు. తవ్వకాల్లో దేవుని విగ్రహం బయటపడిందని పుకారు లేపారు. అది చాలా పురాతన విగ్రహమని.. దానికి ఎన్నో మహిమలు ఉన్నాయని ప్రచారం మొదలుపెట్టారు. దాంతో అక్కడ పూజలు మొదలయ్యాయి. చిన్న గుడిసె వేసి అందులో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ముందు రెండు టెంట్లు వేసి ఆలయం తరహా కలరింగ్‌ ఇవ్వడం మొదలెట్టారు.

'భూమి ఇవ్వనని చెబితే మల్లన్న విగ్రహం తీసుకువచ్చి రాత్రి సమయంలో నా భూమిలో పాతిపెట్టారు. తెల్లారి విగ్రహం తేలిందని మల్లన్న గుట్ట అని చెప్పారు. అధికారుల దగ్గరికి వెళ్తే ఎవరూ పట్టించుకోలేదు. దేవాదాయశాఖ అధికారుల దగ్గరికి వెళ్లిన. వాళ్లు వచ్చి ఎంక్వైరీ చేశారు. ఆ విగ్రహం పురాతనమైంది కాదని... ఇప్పటిదే అని సర్టిఫికేట్ ఇచ్చారు.' -ఏసంతి, బాధిత రైతు

నా భూమి నాక్కావాలి:ఇదే విషయం అధికారులకు విన్నవించుకున్నా ఏసంతిని పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. తనకు అన్యాయం చేయవద్దని... భూమిని తన నుంచి లాక్కొవద్దని వేడుకుంటున్నాడు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని తన భూమిని తనకు ఇప్పించాలని కోరుతున్నాడు.

ఇదీ చదవండి :కొత్త జిల్లాల్లో భూముల మార్కెట్ ధరల సవరణ..పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు

ABOUT THE AUTHOR

...view details