సినిమా థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లతో సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని చర్చలు జరిపారు. సచివాలయంలోని 5వ బ్లాక్లో గంటన్నర పాటు కొనసాగిన చర్చల్లో సినిమా టికెట్ల ధరలు, థియేటర్లపై తనిఖీలు అంశాలపై చర్చించారు. సినిమా టికెట్ల ధరలు పెంచకపోవడం వల్ల తాము ఎదుర్కొంటోన్న సమస్యలను సినిమా థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు మంత్రికి ఏకరువు పెట్టారు. కొవిడ్ కారణంగా తాము తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు ఎదర్కొంటున్నట్లు తెలిపారు. కష్టాల దృష్ట్యా సినిమా టికెట్ల ధరలు పెంచాలని మంత్రిని కోరారు. కేటగిరీల వారీగా ఎసీ, నాన్ ఏసీ థియేటర్లలో పలు కేటగిరీల్లో టికెట్ ధరలు పెంచాలని కోరినట్లు ప్రతినిధులు తెలిపారు. సీజ్ చేసిన థియేటర్లు తెరవకపోతే తాము తీవ్రంగా ఇబ్బందులు పడతామన్నారు.
టికెట్ల అంశంపై కమిటీ..
టికెట్ల పెంపు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి నాని వెల్లడించారు. హైకోర్టు సూచనల మేరకు సినిమా టికెట్ల అంశంపై ప్రభుత్వం కమిటీని వేసిందని..,త్వరలో సమీక్ష జరిపి సమగ్ర నివేదిక ఇస్తుందని తెలిపారు. వివిధ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. తక్కువ ధరల్లో ప్రజలకు వినోదాన్ని ఇచ్చే అంశాన్ని కమిటీ పరిశీలిస్తుందని మంత్రి తెలిపారు. సామాన్యులు ఇబ్బందులు పడకుండా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
"సినిమా టికెట్ల ధరలు పెంచాలని డిస్ట్రిబ్యూటర్లు కోరారు. టికెట్ల పెంపు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పాం. హైకోర్టు సూచనల మేరకు ధరలపై నిన్ననే ప్రభుత్వం కమిటీ వేసింది. కమిటీ త్వరలో రివ్యూ చేసి సమగ్ర నివేదిక ఇస్తుందని చెప్పాం. వివిధ సంఘాల విజ్ఞప్తులు కమిటీ పరిగణనలోకి తీసుకుంటుంది. తక్కువ ధరలో ప్రజలకు వినోదం ఎలా ఇవ్వచ్చో కమిటీ పరిశీలిస్తుంది. సామాన్యులు ఇబ్బందులు పడకుండా సమస్యకు పరిష్కారం."- పేర్ని నాని, మంత్రి
ఎవరిపైనా కక్ష లేదు..
సినిమా థియేటర్లపై తనిఖీలు అంశంపైనా సమావేశంలో చర్చ జరిగింది. లైసెన్సులు, తగిన పత్రాలు లేకుండా సినిమాలు నడుపుతున్న వారిపైన మాత్రమే చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. చాలా మంది ఫైర్ విభాగం నుంచి ఎన్వోసీ, రెవెన్యూ నుంచి బీ ఫాం తెచ్చుకోకుండా, సరైన పత్రాలు లేకుండా సినిమాలు నడుపుతున్నారన్నారు. వెంటనే సంబంధిత పత్రాలు తెచ్చుకోవాలని గత సెప్టెంబరులో డిస్ట్రిబ్యూటర్లుతో జరిగిన సమావేశంలో స్పష్టం చేశారమన్నారు. అనుమతి పత్రాలు లేకుండా థియేటర్లు నడిపినవారిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తమకు ఎవరిపైనా కక్ష లేదన్నారు. ఇప్పటి వరకు 9 జిల్లాలో కలిపి నిబంధనలు పాటించకుండా నడపుతోన్న 130 థియేటర్లను మూసేసినట్లు మంత్రి తెలిపారు.