విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనపై సీఐడీ అధికారులు విచారణ ప్రారంభించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ ఆధ్వర్యంలోని సిబ్బంది.. ఘటన వివరాలు సేకరించారు. మీడియాకు ఆ వివరాలు వెల్లడించారు.
ఎవరో కావాలనే చేసినట్లుంది: సీఐడీ అదనపు డీజీ
ఘటన జరిగిన విధానం చూస్తే ఎవరో కావాలనే చేసినట్లుందని సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ అభిప్రాయపడ్డారు. విగ్రహం తలను ఖండించేందుకు వాడిన రంపం దొరికిందని తెలిపారు. ఘటనకు సంబంధించి అనేక ఆధారాలు సేకరించామన్న ఆయన... గుడిలోని ఆభరణాలు, వస్తువులు దొంగిలించలేదని వెల్లడించారు. ఉద్దేశ పూర్వకంగానే విగ్రహ ధ్వంసానికి పాల్పడినట్లు అనిపిస్తోందని చెప్పారు. కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతుందని స్పష్టం చేశారు. దోషులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.
'ఘటన జరిగిన తీరు.. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ఉద్దేశ్యంతోనే చేసినట్లు కనిపిస్తోంది. ఆలయంలో ఎలాంటి నగలు, నగదు చోరీ జరగలేదు. ఆలయం కూడా రోడ్డు పక్కన లేదు. చాలా ఎత్తుపై ఉంది. దాదాపు 400 మీటర్లు ఉండే ఎత్తైన కొండపై గుడి ఉంది. అక్కడ ఏ సమయంలో ఎవరు ఉంటారు.. ఎవరు ఉండరు అనే విషయాలపై సమగ్ర అవగాహన ఉన్న వాళ్లే ఈ ఘటనకు పాల్పడ్డారని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చాం. ఆకతాయిలు చేయలేదని స్పష్టంగా తెలుస్తోంది. రంపం తీసుకురావడం.. తలను కోనేటిలో పడేయటం చూస్తే... దుండగులకు ఆలయంపై పూర్తి పట్టు ఉందని అర్థమవుతోంది. పక్కా ప్రణాళికతో ఘటనకు కుట్ర చేశారు. దర్యాప్తు ప్రారంభమైంది. త్వరలోనే దోషులను పట్టుకుంటాం' - సునీల్ కుమార్, సీఐడీ అదనపు డీజీ
ఇదీ చదవండి:
ఈ నెల 13నే భారత్లో వ్యాక్సినేషన్ షురూ!