ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేరం చేసినట్లు ఒప్పుకోవాలన్నారు: గౌతు శిరీష

Gouthu Sirisha: విచారణ సందర్బంగా.. క్రైం చేసినట్లు ఒప్పుకోవాలని తనను సీఐడీ అధికారులు బెదిరించారని తెదేపా నేత గౌతు శిరీష చెప్పారు. ఈ నెల 9న మళ్లీ విచారణకు హాజరుకావాలని చెప్పారన్నారు. సోషల్​ మీడియాలో అభ్యంతరకర పోస్టుల కేసులో గౌతు శిరీషను సీఐడీ విచారించింది.

నేరం చేసినట్లు ఒప్పుకోవాలన్నారు: గౌతు శిరీష
cid interrogation on gouthu sirisha

By

Published : Jun 6, 2022, 3:59 PM IST

Updated : Jun 7, 2022, 6:33 AM IST

నేరం చేసినట్లు ఒప్పుకోవాలన్నారు: గౌతు శిరీష

CID on gouthu sirisha: ఎలాంటి నేరమూ చేయకపోయినా.. చేసినట్లు అంగీకరించాలని సీఐడీ అధికారులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారని తెదేపా నాయకురాలు గౌతు శిరీష ఆరోపించారు. ‘ఓ కాగితంపై వారికి నచ్చినట్లు రాసుకొచ్చి దానిపై సంతకం చేయాలంటూ ఒత్తిడి చేశారు. అందులో రాసిన అంశాలను నేను అంగీకరించడం లేదని సంతకం చేస్తానని చెప్పగా.. అలా అయితే ఇక్కడి నుంచి బయటికి పంపించేదే లేదంటూ హెచ్చరించారు. అసలు ఏ కేసులో నాకు నోటీసులిచ్చారో దానికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ అడిగినా పట్టించుకోలేదు. 7 గంటల పాటు కనీసం మంచినీళ్లు, ఆహారమైనా ఇవ్వకుండా బంధించి విచారించారు’ అని ఆమె పేర్కొన్నారు.సోమవారం సీఐడీ విచారణ అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ 9న మరోసారి హాజరవ్వమన్నారని చెప్పారు. అమ్మఒడి, వాహనమిత్ర పథకాలను నిలిపేస్తున్నారని పేర్కొని ఉన్న నకిలీ ప్రెస్‌నోట్‌ను సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేశారంటూ గత నెల 29న సీఐడీ పలువురిపై కేసు నమోదుచేసింది. అందులో భాగంగా గౌతు శిరీషను కూడా నిందితురాలిగా పేర్కొని విచారణకు పిలిపించింది. మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఆమె విచారణకు హాజరయ్యారు. సాయంత్రం 6 గంటలకు బయటకు వచ్చారు. అనంతరం విచారణ జరిగిన తీరును ఆమె వివరించారు.

ఉగ్రవాదులతో వ్యవహరించినట్లు నాతో ప్రవర్తించారు

‘‘నా సామాజిక మాధ్యమ ఖాతాలకు సంబంధించిన పాస్‌వర్డ్‌లు అడిగారు. అవి గుర్తులేవనడంతో కొత్త పాస్‌వర్డ్‌లు సృష్టించి నాతోనే వాటిని ఓపెన్‌ చేయించారు. మా న్యాయవాదిని, నన్ను వేర్వేరు గదుల్లో ఉంచారు. ఫోన్‌లు అందుబాటులో లేకుండా చేశారు. ఉగ్రవాదులతో వ్యవహరించినట్లు ప్రవర్తించారు. ‘పోస్టును షేర్‌ చేయాలంటూ అందరితోనూ మీరే చెప్పారట కదా! మీతో ఆ పోస్టు ఎవరు పెట్టించారో చెప్పండి’ అని ప్రశ్నించడంతో నేను అలాంటి పోస్టులేవి పెట్టలేదన్నాను. ఫేస్‌బుక్‌లో నా ఫ్రెండ్స్‌ లిస్ట్‌లో ఉన్న వారు ఎవరో చెప్పాలని అడగగా... చెప్పాల్సిన అవసరం లేదన్నాను. అరగంటకు ఒకసారి బయటకు వెళ్లిన అధికారులు వారి ఉన్నతాధికారులు చెప్పింది విని మళ్లీ నన్ను విచారించారు. అక్రమ కేసులో నన్ను ఇరికించాలని ప్రయత్నించారు. నా చుట్టూ 30-40 మంది పోలీసుల్ని పెట్టి వరండాలోకి కూడా అడుగుపెట్టనీయకుండా చేశారు’’ అని శిరీష వివరించారు. శిరీషను పిలిపించిన విధానం సరిగాలేదని, ఆమెను వేధించారని న్యాయవాది లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ...‘‘నా పేరుతో మంత్రి అంబటి రాంబాబు ఓ నకిలీ ట్వీట్‌ను పోస్టు చేశారు. దీనిపై సీఐడీకి ఫిర్యాదు చేస్తా. ఆయన్ను సీఐడీ అధికారులు విచారణకు పిలిపించగలరా?’’ అని ప్రశ్నించారు.

తెదేపా నాయకులను అడ్డుకున్న పోలీసులు

సోమవారం ఉదయం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, తెదేపాకు చెందిన ఇతర ముఖ్య నాయకులతో కలిసి సీఐడీ ఆఫీస్‌కు శిరీష కాలినడకన బయల్దేరారు. సీకే కన్వెన్షన్‌ సెంటర్‌ వద్దకు చేరుకోగానే పోలీసులు వారిని అడ్డుకున్నారు. శిరీషను, ఆమె న్యాయవాది లక్ష్మీనారాయణను మాత్రమే అనుమతించారు. సాయంత్రం 5.30 గంటలు అవుతున్నా పోలీసులు విడిచిపెట్టకపోవటంతో తెదేపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఆ తర్వాత ఆమె బయటకు రావటంతో తెదేపా కార్యకర్తలు స్వాగతం పలికారు. మరో పక్క సర్వీసు రోడ్డు మొత్తం బారికేడ్లు అడ్డంగా పెట్టారు. బస్సుల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

అందుకే 12మందిపై కేసులు: ఏపీ సీఐడీ

ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలనే ఉద్దేశంతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన 12మందిపై కేసులు నమోదు చేశామని ఏపీ సీఐడీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ అధికార ముద్రను ఉపయోగించి.. ప్రభుత్వ పథకాలపై దుష్ప్రచారం చేసేలా ఉన్న నకిలీ ప్రెస్‌నోట్‌ను వీరంతా ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారని పేర్కొంది. ఇప్పటివరకూ నలుగుర్ని విచారించామని తెలిపింది. గౌతు శిరీషకు 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులిచ్చి విచారణకు పిలిపించామని చెప్పింది.

ఇవీ చదవండి:

Last Updated : Jun 7, 2022, 6:33 AM IST

ABOUT THE AUTHOR

...view details